Sunday, January 19, 2025

నేడు పంజాబ్‌తో లక్నో పోరు

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌లో భాగంగా శనివారం జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. పంజాబ్ ఇప్పటికే శుభారంభం చేయగా లక్నో తొలి విజయం కోసం పోరుకు సిద్ధమైంది. కిందటి మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో లక్నో ఓటమి పాలైంది. పంజాబ్ కూడా ఇంతకుముందు జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా తిరిగి గాడిలో పడాలనే పట్టుదలతో పంజాబ్ ఉంది. ఇక సొంత గడ్డపై జరుగుతున్న పోరులో ఎలాగైనా విజయం సాధించి ఐపిఎల్‌లో బోణీ కొట్టాలనే పట్టుదలతో లక్నో ఉంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఇటు లక్నో అటు పంజాబ్ టీమ్‌లు సమతూకంగా కనిపిస్తున్నాయి. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది. ఈసారి మాత్రం మెరుగైన ప్రదర్శనతో పంజాబ్‌ను ఓడించాలని భావిస్తోంది. కిందటి మ్యాచ్‌లో స్టార్ ఆటగాళ్లు క్వింటన్ డికాక్, పడిక్కల్, బడోని, స్టోయినిస్ తదితరులు బ్యాటింగ్‌లో విఫలమయ్యారు.

వీరి వైఫల్యం జట్టును వెంటాడింది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా వీరు తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. ఒంటిచేత్తో మ్యాచ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన డికాక్, పడిక్కల్‌లు విజృంభిస్తే లక్నో బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. ఇక తొలి మ్యాచ్‌లో మెరుగైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న కెప్టెన్ కెఎల్ రాహుల్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఈసారి కూడా రాహుల్ తన బ్యాట్‌తో జట్టుకు అండగా నిలువాలనే పట్టుదలతో ఉన్నాడు. ఎలాంటి బౌలింగ్‌నైనా ధీటుగా ఎదుర్కొనే సత్తా కలిగిన రాహుల్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు ఇబ్బందులు ఖాయం. బ్యాట్‌తో పాటు కెప్టెన్‌గా కూడా రాహుల్ మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీపక్ హుడా, బడోని తదితరులు కూడా జట్టుకు అండగా నిలువక తప్పదు. మరోవైపు తొలి మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న నికోలస్ పూరన్ కూడా మరోసారి చెలరేగేందుకు సిద్ధమయ్యాడు.

రాజస్థాన్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న పూరన్ ఆ మ్యాచ్‌లో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా జట్టు అతని నుంచి ఇలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది. కృనాల్ పాండ్య, స్టోయినిస్‌లు కూడా తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచాల్సి ఉంటుంది. విధ్వంసక బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన వీరిద్దరూ విజృంభిస్తే పంజాబ్ భారీ స్కోరు కష్టమేమీ కాదు. రవి బిష్ణోయ్, నవీనుల్ హక్, కృనాల్, మోసిన్ ఖాన్ తదితరులతో లక్నో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీనికి సొంత గడ్డపై మ్యాచ్ జరుగుతుండడంతో లక్నోకే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.
విజయమే లక్షంగా..
మరోవైపు పంజాబ్ కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. కెప్టెన్ శిఖర్ ధావన్, బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, లివింగ్‌స్టోన్, సామ్ కరన్, జితేష్ శర్మ తదితరులతో పంజాబ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. కెప్టెన్ ధావన్ రెండు మ్యాచుల్లోనూ బాగానే ఆడాడు. అయితే స్టార్ ఆటగాడు బెయిర్‌స్టో వైఫల్యం జట్టును వెంటాడుతోంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా అతను తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. బెయిర్‌స్టో ఒకసారి గాడిలో పడితే అతన్ని ఆపడం ఎంత పెద్ద బౌలర్‌కైనా కష్టమేనని చెప్పాలి. ఈ మ్యాచ్‌లో బెయిర్‌స్టోపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక లివింగ్‌స్టోన్, సామ్ కరన్‌ల రూపంలో విధ్వంసకర బ్యాటర్లు ఉండనే ఉన్నారు. వీరిద్దరూ కూడా చెలరేగితే లక్నో బౌలర్లకు కష్టాలు ఖాయం. ఇక అర్ష్‌దీప్, రబడా, హర్‌ప్రీత్ బ్రార్, సామ్ కరన్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. అయితే కీలక బౌలర్ హర్షల్ పటేల్ రెండు మ్యాచుల్లోనూ విఫలం కావడం జట్టును కలవరానికి గురిచేస్తోంది. ఇలాంటి స్థితిలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేస్తేనే పంజాబ్‌కు గెలుపు అవకాశాలుంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News