లక్నో: ఐపిఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 21పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో లక్నోకు ఇదే తొలి విజయం కాగా, పంజాబ్ రెండో ఓటమిని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు మాత్రమే చేసి పరాజయం చవిచూసింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్‌కు ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్‌లు శుభారంభం అందించారు.
ఇద్దరు లక్నో బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. ధాటిగా ఆడిన బెయిర్‌స్టో 29 బంతుల్లోనే 3 సిక్సర్లు, మరో 3 ఫోర్లతో 42 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (19) కూడా ధాటిగా ఆడాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన శిఖర్ ధావన్ 50 బంతుల్లో ఏడు ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు సాధించాడు. అయితే లక్నో బౌలర్ మయాంక్ యాదవ్ అద్భుత బౌలింగ్‌తో పంజాబ్ బ్యాటర్లను హడలెత్తించాడు. అతనికి మూడు వికెట్లు దక్కాయి. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన లక్నోను ఓపెనర్ డికాక్ (54), కృనాల్ పాండ్య (43), కెప్టెన్ పూరన్ (42) ఆదుకున్నారు.