ఇద్దరు నిందితుల అరెస్టు, పరారీలో ఇద్దరు
నెలకు 1,000 వసూలు, 3,000మంది బాధితులు
రూ.25లక్షల విలువైన వస్తువులు స్వాధీనం
హైదరాబాద్: లక్కీ డ్రా పేరుతో అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను ఎస్‌ఓటి మల్కాజ్‌గిరి పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.2,20,000 నగదు, 100 ఎల్‌ఈడి టివిలు, 12.2 కిలోల సిల్వర్ బిస్కట్లు, నాలుగు బ్యాంక్ ఖాతాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ రూ.25లక్షలు ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం…కుషాయిగూడ, ఈసిఐఎల్, కమాలానగర్‌కు చెందిన షేక్ సలాఉద్దిన్ రీబోరింగ్ వర్క్ చేస్తున్నాడు, రంగారెడ్డి జిల్లా, జల్‌పల్లికి చెందిన షాహబ్ మీర్ ఖాన్ అలియాస్ షాదమ్ మీర్ ఖాన వ్యాపారం చేస్తున్నాడు. బోరబండకు చెందిన షరీఫ్, ఏజెంట్లు కలిసి ముఠాను నడుపుతున్నారు. షేక్ సలాఉద్దిన్, షాహబ్ మీర్ ఖాన్ కలిసి లక్కీ డ్రా స్కీమును ప్రారంభించారు. ఎన్‌ఐఎస్‌ఈ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించి అమాయకులకు మాయమాటలు చెప్పారు. ప్రకటనలు, బుక్‌లెట్స్ పంపిణీ చేశారు. నెలకు రూ.1,000 చొప్పున 16 నెలలు కడితే లక్కీడ్రాలో విలువైన బహుమతులు వస్తాయని నమ్మించారు.
30 నుంచి 35మందిని ఏజెంట్లుగా నియమించుకుని అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేశారు. లక్కీడ్రాలో 3,000 మందిని సభ్యులుగా చేర్చుకున్నారు. లక్షీ డ్రా వ్యాపారాన్ని నిందితులు నవంబర్, 2020లో ప్రారంభించారు, మరో స్కీమును జనవరి,2022 నుంచి ప్రారంభించి డబ్బులు వసూలు చేస్తున్నారు. పదహారు నెలలకు రూ.4.08కోట్లు వసూలు చేయాలని ఖర్చులకు సగం పోను మిగిలిన డబ్బులను సగం పంచుకోవాలని ప్లాన్ వేశారు. నిందితులు, ఏజెంట్ల సాయంతో లక్కీడ్రాను మౌలాలీలోని కలర్స్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించేవారు. అక్కడ విన్నర్ పేరు, డ్రాలో వచ్చి బహుమతి గురించి ఎక్కుడా ప్రకటించేవారు కాదు. ఆఫీస్‌కు వచ్చి బహుమతిని కలెక్ట్ చేసుకోమని చెప్పేవారు. కానీ వీరి ఆఫీస్ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఈ విషయం మల్కాజ్‌గిరి ఎస్‌ఓటి పోలీసులకు తెలియడంతో దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం మాల్కాజ్‌గిరి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇన్స్‌స్పెక్టర్ సుధాకర్,మన్మోహన్ తదితరులు పట్టుకున్నారు.