బ్రసిలియా ( బ్రెజిల్ ) : బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మద్దతుదారులు రాజధాని బ్రసిలియాలో అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ జూలియో సిజర్ డే అరుడాను శనివారం అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా ఆర్మీ చీఫ్ పదవి నుంచి తొలగించారు. ఇటీవల జరిగిన బ్రెజిల్ ఎన్నికల్లో లూలా గెలిచినప్పటికీ, జైర్ బోల్సొనారో ఓటమిని అంగీకరించడానికి నిరాకరించారు. ఈ క్రమం లోనే జనవరి 8న వేల సంఖ్యలో బోల్సొనారో మద్దతుదారులు రాజధాని లోని కీలక భవనాలపై దాడి చేసి చొరబడ్డారు.
సైన్యం జోక్యం చేసుకొని బోల్సొనారోకు అధికారం అప్పజెప్పాలని, లేదా ప్రస్తుత అధ్యక్షుడు లూలాను అధికార పీఠం నుంనచి దింపేయాలని డిమాండ్ చేశారు. అయితే భద్రతా బలగాలు రంగం లోకి దిగి వారిని చెదరగొట్టాయి. ఈ అల్లర్లలో సైన్యం హస్తం ఉందని ఆరోపిస్తూ అధ్యక్షుడు లూలా సైన్యాన్ని లక్షంగా చేసుకుని కొన్ని మార్పులు చేశారు. ఇందులో భాగంగా దేశ ఆర్మీ జనరల్ జూలియో సిజర్ డె అర్రుడాను పదవి నుంచి తొలగించారు. జూలియో స్థానంలో జనరల్ టొమస్ మిగ్యూల్ రెబెరో పైవాను నియమించినట్టు ఆ దేశ సైన్యం అధికారిక వెబ్‌సైట్ వెల్లడించింది.