ముషీరాబాద్: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహారిస్తున్నందున ఈ నెల 11 నుంచి 13 వరకూ సమ్మె చేయాలని నిర్ణయించినట్టు సిఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటీయూ అనుబంధం) రాష్ట్ర కమిటీ సమావేశం గురు వారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. యూనియన్ నాయకురాలు ఇందూరు సులోచన అధ్య క్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ దేశంలో పేద కుటుంబాల పిల్లలకు పోషకాహార లోపం తీవ్రంగా ఉందన్నారు.
దేశ జనాభాలో 39 శాతం మంది పిల్లలు ఆహార లేమి, ఆకలితో అలమటించే పిల్లలకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతోందని అన్నారు. ఈ పథకానికి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయిం చాలని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మి కులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన చెందారు. ఈ పథకంలో పనిచేసే కార్మికులకు రూ.1వెయ్యి నుంచి రూ.3 వేల వరకూ గౌరవ వేతనం పెంచుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అనేక పోరాటాల ఫలితంగా జీవో నంబరు 8 విడుదలైనప్పటికీ అమలు కావడం లేదన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, ఎరియార్స్‌తో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఎజే రమేష్, సిఐటియూ నాయకులు ఆర్. శ్రీనివాస్, రాజు, దీప్లా నాయక్, రమ్య, కృష్ణమాచారి, యూనియన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సీహెచ్ ప్రవీణ్ కుమార్, సత్యనారాయణ, సరస్వతి, నరసమ్మ, దాసరి కళావతి, చామంతి లక్ష్మీ, గోవర్థన్ తదితరులు పాల్గొన్నారు.