Friday, November 22, 2024

ఊపిరితిత్తులకు ‘పొగ’పెడుతున్న దురలవాటు

- Advertisement -
- Advertisement -

డబ్ల్ల్యుహెచ్‌ఒ వివరాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏట 2 మిలియన్ల లంగ్ క్యాన్సర్ కొత్త కేసులు, 1.8 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయని తెలుస్తున్నది. భారత దేశ వ్యాప్తంగా 1.57 మిలియన్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు నమోదు అయ్యాయని, 2020లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1.80 మిలియన్ల లంగ్ క్యాన్సర్ మరణాలు జరుగుతున్నట్లు గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ఊపిరితిత్తుల్లో కణజాలం నియంత్రణ లేకుండా పెరగడాన్ని లంగ్ క్యాన్సర్ అంటాం.

శ్వాసక్రియలో ఊపిరితిత్తులు అతి ముఖ్యమైన భాగం. శ్వాస తీసుకోవడం ఆలస్యం అయితే ఉక్కిరిబిక్కిరి అవుతాం. ఊపిరి పీల్చుకోవడం, ఆక్సిజన్‌ను శరీర కణజాలానికి సరఫరా చేయడం, వ్యర్థాలను తిరిగి ఊపిరితిత్తుల ద్వారా బయటకు పంపించడమనే అతి ప్రధానమైన విధులను ఊపిరితిత్తులు నిరంతరం నిర్వహిస్తాయి. ఊపిరి ఆగితే జీవనపయనం ఆగినట్లే. అలాంటి ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ కణితి ఏర్పడడంతో క్యాన్సర్ మహమ్మారి రోగం ప్రారంభమవుతుంది. అనేక రకాల క్యాన్సర్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదకరమైనదే కాదు ప్రాణాంతకమైనది కూడా. ఊపిరితిత్తుల క్యాన్సర్‌పట్ల కనీస అవగాహన కల్పించడం, రోగ లక్షణాలను తెలుసుకోవడం, జీవనశైలి మార్పులతో రాకుండా చూసుకోవడం, తొలి దశలో గుర్తించడం, వైద్యవిధానాలను అవగాహన పరుచుకోవడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధిత కుటుంబాలను ఆదుకోవడం, ప్రభుత్వ చేయూతను ప్రచారం చేయడం లాంటి అంశాలను విస్తృతంగా సమాజంలో చర్చించడానికి 2012 నుంచి ఏటా 01 ఆగస్టున ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినం లేదా వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే పాటించుట ఆనవాయితీగా మారింది. వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే -2024 ప్రచార అంశంగా సంరక్షణ గ్యాప్‌ను తగ్గిద్దాం: క్యాన్సర్ బాధితులందరికీ వైద్య సంరక్షణ అర్హతను తీసుకున్నారు.

19వ శతాబ్దంలో 2% లోపు ప్రపంచ మానవాళికి ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకేది. 20వ శతాబ్దంలో లంగ్ క్యాన్సర్ కేసులు పెరగడం గమనించారు. గాలి కాలుష్యం వల్ల మాత్రమే లంగ్ క్యాన్సర్ వస్తుందని భావించే రోజులవి. వైద్యశాస్త్రం ప్రగతి బాటలు పట్టడంతో 1940- 50 ల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు అసలైన కారణాల్లో దీర్ఘకాలం పాటు పొగ తాగే దురలవాటు, రెడాన్ వాయు కాలుష్యం, కలుషిత గాలి పీల్చడం, కట్టెల వంట పొగపీల్చడం, పంట అవశేషాలు కాల్చడం, సిలికా/ డిజిల్/ ఆర్సెనిక్ పరిశ్రమ కాలుష్యం, కుటుంబ సభ్యుల నుంచి రావడం లాంటివి కూడా ప్రధానమైన కారణాలుగా గుర్తించినప్పటికీ నేడు లంగ్ క్యాన్సర్‌కు 80% ప్రధాన కారణంగా పొగాకు ఉత్పత్తుల దురలవాటు మాత్రమే గుర్తించబడింది.

డబ్ల్ల్యుహెచ్‌ఒ వివరాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏట 2 మిలియన్ల లంగ్ క్యాన్సర్ కొత్త కేసులు, 1.8 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయని తెలుస్తున్నది. భారత దేశ వ్యాప్తంగా 1.57 మిలియన్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు నమోదు అయ్యాయని, 2020లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1.80 మిలియన్ల లంగ్ క్యాన్సర్ మరణాలు జరుగుతున్నట్లు గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ఊపిరితిత్తుల్లో కణజాలం నియంత్రణ లేకుండా పెరగడాన్ని లంగ్ క్యాన్సర్ అంటాం. అపరిమితంగా తొలి దశలో లంగ్ క్యాన్సర్‌కు స్పష్టమైన రోగ లక్షణాలు కనిపించనప్పటికీ దీర్ఘకాలం దగ్గు రావడం, ఛాతి నొప్పి, ఊపిరి ఆడడం తగ్గిపోవడం (షార్ట్ బ్రీత్), కఫంలో రక్తం పడడం, మింగలేకపోవడం, గురక రావడం పిల్లికూతలు, బరువు తగ్గడం, ఆయాసం, ఎముకల్లో నొప్పి, జ్వరం, వేలి గోర్లు వెడల్పుకావడం, అలసట/ నీరసం, ఆహారం రుచించకపోవడం, గొంతు బొంగురుపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే క్యాన్సర్ వైద్య్ నిపుణులను సంప్రదించాలి.

ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సలో తీవ్రతను బట్టి కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇమ్యూనోథెరపీ, శస్త్ర చికిత్సతో కణితి తొలగించడం, ఔషధ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఆయుర్వేద విధానంలో పిప్పలి, పొడి అల్లం, తానికాయ (బిభితాకి), అతిమధురం (ములేతి), తులసి, ఆయుర్వేద దగ్గు సిరప్, యోగా లాంటి చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. పొగతాగే దురలవాటును శాశ్వతంగా వదులు కోవడం, పొగ తాగే వారి సమీపాన ఉండకుండా జాగ్రత్త పడడం, రెడాన్ రేడియేషన్‌కు దూరంగా ఉండడం, కలుషిత గాలి పీల్చకపోవడం, కుటుంబ చరిత్రను తెలుసుకొని మసలుకోవడం, రోగ లక్షణాలు కనిపించగానే పరీక్షలు చేయించుకోవడం, తొలి దశలో గుర్తించడం, సరైన చికిత్సలు తీసుకోవడం, కట్టెలపొయ్యి వంటలకు చరమగీతం పాడడం లాంటి జాగ్రత్తలు ఊపిరితిత్తుల క్యాన్సర్ బారి నుంచి రక్షిస్తాయని తెలుసుకోవాలి. అమూల్యమైన ప్రాణాలను నిలుపుకోవాలి.

బుర్ర మధుసూదన్ రెడ్డి 9949700037

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News