సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ ఆల్బమ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. సంగీత సంచలనం ఎస్.ఎస్. తమన్ మ్యూజిక్ లో ఇప్పటికే విడుదలైన కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్ అన్నీవర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ ట్రెండింగ్‌లో వున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ‘సర్కారు వారి పాట’కి అద్భుతమైన సాహిత్యం అందించిన గేయ రచయిత అనంత శ్రీరామ్ మీడియాతో మాట్లాడుతూ… ‘గీత గోవిందం విజయం తర్వాత నాతో పాట రాయించాలని దర్శకుడు పరశురాంకి అనిపించింది. ఐయితే సినిమాలో ప్రతీ పాట నాతో రాయాలనిపించడం మాత్రం దైవ సంకల్పం. ఒక పాట బావుందని మరో పాట.. ఇలా ఐదు పాటలూ రాయించారు. ఐదూ విభిన్నమైన పాటలు. పెన్నీ సాంగ్ హీరో కారెక్టరైజేషన్‌కి సంబధించి ఉంటుంది. ఇక రూపాయి ఎవరిదైన దాన్ని గౌరవించే క్యారెక్టర్ హీరోది. దీన్నే మాస్ ధోరణిలో పెన్నీ సాంగ్‌లో చెప్పాము. కళావతి ఇప్పటికే పెద్ద విజయం సాధించింది. ఎంతటి పోగరబోతు కూడా అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ప్రాధేయపడి ఆమె ప్రేమని కోరుతాడనేది ఈ పాటలో అందంగా చెప్పాం. సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ పూర్తి కమర్షియల్‌గా ఉంటుంది. మరో రెండు పాటలు కూడా ఈ వారంలోనే విడుదలౌతాయి. ఆ రెండు పాటలు కూడా అద్భుతంగా కుదిరాయి, అభిమానులని అలరిస్తాయి. సంగీత దర్శకుడు తమన్ లయ మాంత్రికుడు. మనం మామూలు సాహిత్యం ఇచ్చినా అతని రిధమ్‌తో కొత్తగా అనిపిస్తుంది. తమన్ సౌండ్ చాలా గ్రాండ్‌గా ఉంటుంది. అతని బీట్ తగ్గట్టు సాహిత్యం రాస్తే అద్భుతంగా వినిపిస్తుంది’ అని అన్నారు.
Lyricist Anantha Sriram about Sarkaru Vaari Paata