న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 13,14 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ప్రధాని మోడీ భేటీ అవుతారు. ఉభయ దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావడంతోపాటు ప్రాంతీయ , అంతర్జాతీయ స్థాయిలో పరస్పర అభిప్రాయాలు విస్తరించేలా వీరి మధ్య చర్చలు జరుగుతాయి. అబుధాబీలో మొట్టమొదటి హిందూ ఆలయం బిఎపిఎస్ మందిర్‌ను ప్రధాని మోడీ ఆవిష్కరిస్తారు.
ఈ సందర్భంగా అక్కడి జాయేద్ స్పోర్ట్ సిటీలో హిందూ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటనలో పేర్కొంది. మోడీ 2015లో ప్రధాని అయిన తరువాత యుఎఇలో పర్యటించడం ఇది ఏడోసారి. యుఎఇ ఉపాధ్యక్షుడు, ప్రధాని, రక్షణ మంత్రి అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్‌ను కూడా మోడీ కలుసుకుంటారు. ఆయన ఆహ్వానంపై దుబాయ్‌లో ప్రపంచ స్థాయి సదస్సులో మోడీ పాల్గొని కీలక ఉపన్యాసం ఇస్తారు.