Saturday, December 21, 2024

అన్నదాత

- Advertisement -
- Advertisement -

ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ సారథి ఎంఎస్ స్వామినాథన్ అస్తమయం దేశానికి పూరించలేని లోటు. ఆయన మృతితో భారత దేశ చరిత్రలో ఒక మహోజ్వల అధ్యాయం ముగిసిపోయింది. దేశంలో ఆహార కొరతను తీర్చడానికి ఆయన తన మేధస్సును రాపాడించిన తీరు ఆదర్శప్రాయమైనది. వైద్య విద్యలో ప్రవేశించిన స్వామినాథన్ 1943 బెంగాల్ కరవులో 2030 లక్షల మంది బలి కావడాన్ని చూసి చలించిపోయారు. దానితో వైద్య విద్యకు స్వస్తి చెప్పి వ్యవసాయ కళాశాలలో ప్రవేశించారు.బంగాళా దుంపలు, వరి, గోధుమ పంటల ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి మార్గాలను అన్వేషించడం మొదలు పెట్టారు. ఆయన కృషి దేశానికి ఎంత మేలు చేసిందంటే ఆయన మాటల్లోనే ‘1947లో స్వాతంత్య్రం వచ్చినప్పుడు 60 లక్షల టన్నులకే పరిమితమైన దేశ గోధుమ ఉత్పత్తి 1962 నాటికి కోటి టన్నులకు చేరుకోగా, 1964 1968 మధ్య ఇది కోటి 70 లక్షల టన్నులకు విజృంభించింది, దిగుమతి చేసుకుంటే గాని భారత ప్రజల రోజువారీ భోజన అవసరం తీరదని బయట దేశాల వారు వేలెత్తి చూపుతున్న రోజులవి. అమెరికా నుంచి పిఎల్ 480 పథకం కింద గోధుమలను దిగుమతి చేసుకొంటున్నాము.

1966లో తలెత్తిన కరవును ఎదుర్కోడానికి కోటి టన్నుల పిఎల్ 480 గోధుమలను అక్కడి నుంచి తెచ్చుకొన్నాము. ఆ రోజుల్లో 1963 నుంచి ఐదేళ్ళు కృషి చేసి పొట్టి రకం అధికోత్పత్తి గోధుమ వంగడాన్ని స్వామినాథన్ కనుగొన్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. విదేశీ అధికోత్పత్తి వంగడాలను భారత దేశ పరిస్థితులకు అనుగుణంగా మార్చడం ద్వారా స్వామినాథన్ తన లక్షాలను సాధించగలిగారు. ఇందులో అమెరికన్ శాస్త్రవేత్త ఓగెల్, ముఖ్యంగా మెక్సికో వ్యవసాయ శాస్త్రజ్ఞుడు నార్మన్ బోర్లాగ్ ఆయనకు ఉపయోగపడ్డారు. మంచి వంగడం ఆహారోత్పత్తిలో విప్లవాన్ని సాధిస్తుందనే అభిప్రాయంతో స్వామినాథన్ వ్యవసాయ పరిశోధనను చేపట్టారు. వ్యవసాయ జన్యుశాస్త్రాన్ని మధించారు. దిగుబడిలో మంచి ఫలితాలను సాధించడంపై దృష్టి పెట్టారు. సారవంతమైన నేలకు, ఎరువులకు, మంచి నీటి వసతికి బాగా స్పందించే రకాల వంగడాలను సృష్టించగలిగారు. ఈ కృషిలో సాఫల్యం పొందడానికి ఆయన యూరపు, అమెరికాలోని ప్రముఖ విద్యా సంస్థల్లో చేరి అధ్యయనం చేశారు.

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. పూర్వం ఎత్తైన వరి పంట వుండేది. చేనులో అడుగు పెట్టే మనిషి బయటికి కనిపించే వాడు కాదు. ఈ రకం పంట మంచి దిగుబడి ఇవ్వడం లేదని భావించి స్వామినాథన్ పొట్టి రకం పంటను కనుకొన్నాడు. ఆ విధంగా వరి పంట డిఎన్‌ఎలోనే విప్లవాన్ని తీసుకు రాగలిగాడు. అప్పటికే మంచి సాగు పద్ధతులు పాటిస్తున్న పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లను స్వామినాథన్ తన పరిశోధనలకు ఎంచుకొన్నాడు. అందుచేత ఆయన హరిత విప్లవం అప్పటికే వ్యవసాయకంగా సంపన్నమైన ప్రాంతాలకు మాత్రమే ఉపయోగపడిందనే విమర్శ కూడా వచ్చింది. అదేమైనప్పటికీ అప్పటి వరకు గల ఉత్పత్తి సామర్థాన్ని అసాధారణ స్థాయికి పెంచగలగడం మామూలు విషయం కాదు. దీనిని సాధించిన స్వామినాథన్ దేశంలో హరిత విప్లవ పితగా గుర్తింపు పొందారు. ఇందుకు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఆయనను వరించాయి. 1987లో మొట్టమొదటి ప్రపంచ ఆహార బహుమతి లభించింది. అలాగే 1971లో మెగ్‌సెసే అవార్డు, 1986లో ఐన్‌స్టీన్ ప్రపంచ విజ్ఞాన శాస్త్ర అవార్డు, హెచ్‌కె ఫ్లోరిడా అవార్డు,

లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అవార్డు, ఇందిరా గాంధీ బహుమతి కూడా లభించాయి. ఆయన 1979లో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా పని చేశారు. టైమ్ మేగజైన్ ఎంపిక చేసిన 20వ శతాబ్దపు 20 మంది అత్యంత ప్రభావవంతులైన ఆసియా ప్రముఖుల్లో ఒకరుగా ఎంపికయ్యారు. రైతుకు గిట్టుబాటు ధర విషయంలో స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సు తరచూ ప్రస్తావనకు వస్తూ వుంటుంది. కాని దానిని ఇంత వరకు మన ప్రభుత్వాలు పూర్తిగా అమలు చేయడం లేదు. రైతు ఇంటిల్లిపాది చేసే శ్రమకు గిట్టుబాటు ధరలో ప్రాధాన్యం ఇవ్వాలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసింది. దానిని కూడా కలుపుకొని లెక్కగట్టే ఉత్పత్తి ఖర్చుకు అందులో సగాన్ని కలిపి రైతుకు గిట్టుబాటు ధర చెల్లించాలని ఈ కమిషన్ 2006లో సూచించింది. దీనిని అమలు పరిచి తీరుతామని వాగ్దానం చేసిన ప్రధాని మోడీ ప్రభుత్వం అందులో కూడా విఫలమైంది. స్వామినాథన్ హరిత విప్లవం సాధించిన తర్వాత దేశంలో తిండి గింజలకు కొరత రాలేదంటే అతిశయోక్తి కాదు. అటువంటి గొప్ప దార్శనికుడి, శోధకుడి, సాధకుడి మరణం అత్యంత బాధాకరమైనది. ఆయనకు నివాళి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News