Monday, January 20, 2025

సామాజిక విప్లవకారుడు స్వామినాథన్

- Advertisement -
- Advertisement -

డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ భారత దేశంలో హరిత విప్లవానికి నాయకత్వం వహించిన వ్యవసాయ శాస్త్రవేత్తగా ప్రపంచానికి సుపరిచితమయ్యారు. భారతదేశ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడానికి, ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి ఆయన చేసిన కృషి మరువలేనిది. భారత దేశ చరిత్రలో 1943లో అత్యంత విషాదకరమైన బెంగాల్ కరువు సంభవించింది.సుమారు 40 లక్షల మంది ఈ కరువు బారినపడి మరణించారు. స్వతంత్ర భారతానికి మొదటి సవాలు దేశ ప్రజలందరికీ ఆహారాన్ని అందించడమే. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి ఆహార ఉత్పత్తిలో స్వావలంబన సాధించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత. ఆ సమయంలో భారత ప్రభుత్వం వ్యవసాయ పరిశోధన సంస్థ ఏర్పాటు చేసింది. భారత వ్యవసాయ పరిశోధన సంస్థకి స్వామినాథన్ డైరెక్టర్‌గా బాధ్యత తీసుకోవడం ద్వారా భారత దేశ వ్యవసాయ విప్లవానికి నాయకత్వం వహించారు.

అప్పటివరకు వ్యవసాయ భూమి విస్తీర్ణం పెంచడం ద్వారా ఆహార ఉత్పత్తి పెరగాలని సాంప్రదాయ పద్ధతిలో ఉన్న ఆలోచన విధానాన్ని మార్చివేసి నూతన వ్యవసాయ విధానానికి దారులు చూపారు. స్వామినాథన్ స్వతహాగా జన్యుశాస్త్రవేత్త కావడం వల్ల హైబ్రిడ్ విత్తనాలు, వంగడాలను ఉత్పత్తి చేసి నిర్ణీత భూవిస్తీర్ణంలోనే అధిక దిగుబడిని సాధించే విప్లవాత్మక ప్రక్రియను ప్రవేశపెట్టారు. దాంతో పాటు ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల సాగుభూమి విస్తీర్ణం కూడా పెరిగింది.ఈ ప్రక్రియలు ఏకకాలం లో నిర్వహించడం వల్ల భారత దేశంలో ఆహారోత్పత్తి వేగంగా పెరిగింది. మొదటి దశలో గోధుమ, వరి పంటల దిగుబడిపై దృష్టిపెట్టి భారత ప్రజలను భవిష్యత్తులో కరువు బారిన పడకుండా ముందుకు నడిపిన వ్యక్తిగా మనందరికీ తెలుసు. కానీ ఆయనలోని శాస్త్రవేత్తలాగే బలమైన సామాజికవేత్త ఉన్నారనే విషయం సాధారణ ప్రజలకు అంతగా తెలియదు. ఎంఎస్ స్వామినాథన్ తీసుకొచ్చిన హరిత విప్లవం ద్వారా భారత దేశ ప్రజలు తీవ్ర కరువు నుండి బయటపడినారు. కానీ 1990 నాటికి రైతు ఆత్మహత్యల రూపంలో వ్యవసాయ రంగం కొత్త సంక్షోభాన్ని ఎదుర్కోవడం మొదలైంది.దేశ ప్రజలకు అన్నంపెట్టే రైతన్నల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయి.

సంక్షోభం నుంచి వ్యవసాయరంగాన్ని రైతులను గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ రైతు కమిషన్ను ఏర్పాటు చేసింది. దీనికి నాయకత్వం వహించింది కూడా ఎంఎస్ స్వామినాథన్. డిసెంబర్ 2004లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అక్టోబర్ 2006లో తుది నివేదిక సమర్పించారు. దీనికి ముందు నాలుగు మధ్యంతర నివేదికలు కూడా ఇచ్చినారు. సుమారు రెండు సంవత్సరాల పాటు అధ్యయనం చేసి దేశంలో ఉన్న మౌలిక సమస్యలన్నింటినీ క్రోడీకరించి నివేదిక సమర్పించారు.ఈ నివేదికలో పొందుపరిచిన అంశాలను పరిశీలిస్తే ఆయన సామాజంలో విప్లవాత్మక మార్పురావాలని కాంక్షించారో అర్థం అవుతుంది. వ్యవసాయరంగం, రైతాంగం ప్రస్తుత సంక్షోభం నుంచి బయట పడాలంటే స్వామినాథన్ కమిషన్ చేసిన సూచనలను కేంద్ర ప్రభుత్వం పాటించాలని 2006 నుండి వివిధ రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసులను ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు. జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు చేసే నాటికి భారత దేశంలో సామాజిక రాజకీయ పరిస్థితులను కూడా మననం చేసుకోవాలి. ఈ కమిషన్ ఏర్పాటుకు కొన్ని నెలల ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నక్సలైట్లతో చర్చలు నడుస్తున్నాయి. ఈ చర్చలు దేశవ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలకు వేదికగా మారినాయి.

ఒక రాష్ట్ర ప్రభుత్వంతో సాగిన చర్చలు అయినప్పటికీ భారతదేశంలోని పేదలు రైతుల అందరి సమస్యలు ఈ చర్చల్లో ప్రధానాంశాలుగా ఉన్నాయి. ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో నక్సల్స్ పెట్టిన ప్రధాన డిమాండ్ భూసంస్కరణలు చేపట్టాలి. భూమిలేని పేదలకు అదనపు భూమిని పంచిపెట్టాలని, రైతాంగ సమస్యలను పరిష్కరించాలని తమ డిమాండ్స్‌లో పేర్కొన్నారు. వీటితోపాటు మరి కొన్ని విస్తృత సామాజిక అంశాలపై చర్చలు జరిగినాయి. దేశవ్యాప్తంగా రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభించడం లేదని ఉద్యమాలు చేస్తున్నారు. పెట్టుబడికి, ఉత్పత్తి అయిన ధాన్యానికి లభించే ధరకు పొంతనలేకపోవడం వల్లే వ్యవసాయం దండగనే స్థితికి చేరుకుంటుంది. కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగ సమస్యలను కనీసం పట్టించుకోవడం లేదు. ఆ సమయంలో స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చాలా ప్రాధాన్యత కలది. ఆ కమిషన్ చేసిన సిఫార్సులు న్యాయంగా, శాస్త్రీయంగా ఉన్నాయి. వ్యవసాయ రంగంలో నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కారాలు చూపించారు.జాతీయ రైతు కమిషన్ ఐదు నివేదికలు ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న వ్యవసాయ రంగంపై ప్రభావితం చెప్పే వివిధ అంశాలను పరిశీలన చేసి సూచనలు చేశారు.

వాటిలో కొన్ని పరిశీలిస్తే ఆయన ఏ విధమైన సమాజం కోరుకున్నది అర్థమవుతుంది. భూసంస్కరణలు అమలు చేయాలని స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసింది. రెండున్నర శాతం జనాభా దగ్గర 26 శాతానికి పైగా భూమి ఉండడం సరైనది కాదని సూచించారు. సుమారు 14% మంది 67% భూమిని తమ వద్ద పెట్టుకున్నారని ఇదే వ్యవసాయరంగ సంక్షోభానికి ప్రధాన కారణమని ప్రభుత్వానికి తెలియజేశారు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే దేశంలోని 50% మంది పేద ప్రజలు ఎంత పేదరికంలో ఉన్నారంటే వారి దగ్గర ఉన్న భూమి సుమారు మూడున్నర శాతం మాత్రమే. ఇంతటి అసమానతల మధ్య వ్యవసాయ రంగం నిలదొక్కుకోవడం అసాధ్యమని తమ నివేదికలో పేర్కొన్నారు. సీలింగ్ -మిగులు, వ్యర్థ భూములను పంపిణీచేయాలి. వ్యవసాయేతర ప్రయోజనాల కోసం ప్రధాన వ్యవసాయ భూమి, అడవులను కార్పొరేట్ రంగానికి మళ్లించడాన్ని నిరోధించండి. ఆదివాసీలు, పశువుల కాపరులకు మేత హక్కులు, కాలానుగుణంగా అడవులను ఉమ్మడి ఆస్తి వనరులను రూపొందేలా చేయాలని, జాతీయ భూవినియోగ సలహా సేవను ఏర్పా టు చేయాలి.

ఇది ఒక ప్రదేశం, సీజన్ ఆధారంగా నిర్దిష్ట ప్రాతిపదికన నిర్దిష్ట కార్యాచరణ ఇవ్వాలన్నారు. పర్యావరణ వాతావరణ మార్పులకు మార్కెటింగ్ అవకాశాలకు అనుగుణంగా వ్యవసాయాన్ని తీర్చిదిద్దాలన్నారు. వ్యవసాయ భూమి అమ్మకాన్ని నియంత్రించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. రైతులకు సుస్థిరమైన, సమానమైన నీటిని పొందేందుకు వీలుగా సంస్కరణలు తీసుకురావాలని దీని కోసం సమగ్రమైన సంస్థను ఏర్పాటు చేయాలన్నారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ద్వారా నీటి సరఫరాను పెంచడం, జలాశయాలన్ని రీఛార్జ్ చేయడం తప్పనిసరి చేయాలి. ‘మిలియన్ వెల్స్ రీఛార్జ్’ కార్యక్రమాన్ని ప్రతిపాదించారు. 11వ పంచవర్ష ప్రణాళికలో భారీ నీటి పారుదల వ్యవస్థ, చిన్న నీటి వనరుల వ్యవస్థల మధ్య ఉన్న విభజన రేఖను తొలగించి రెండు వ్యవస్థలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భూగర్భ జలాలను వృద్ధి చేయడానికి కొత్త పథకాలను రూపొందించాలని సూచించారు. పనికి ఆహారం, ఉపాధి హామీ కార్యక్రమాల ఉపయోగకరమైన లక్షణాలను కొనసాగిస్తూ జాతీయ ఆహార హామీ చట్టాన్ని రూపొందించాలి.

పేదల వినియోగం పెరిగితే ఫలితంగా ఆహార ధాన్యాలకు డిమాండ్‌ను పెరుగుతుంది. అప్పుడు దానికి తగినట్టుగా వ్యవసాయ పురోగతికి అవసరమైన ఆర్థిక పరిస్థితులను సృష్టించవచ్చు. కాలక్రమేణా సార్వత్రిక ఆహార భద్రత లక్ష్యాన్ని చేరుకోవాలని దేశంలో పోషకాహార భద్రత కోసం మధ్యకాలిక వ్యూహం, దీర్ఘకాలిక వ్యూహం అమలు చేయాలని, దేశంలోని ప్రధాన వ్యవసాయ వ్యవస్థల ఉత్పాదకతకు, లాభాలను కల్పించడం, ఆ లాభాలు స్థిరంగా ఉండేటట్లు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రైతులందరికీ గ్రామీణ రుణాల ప్రవాహాన్ని గణనీయంగా పెంచడానికి విధాన సంస్కరణలు తీసుకురావాలని, అంతర్జాతీయ ధరలు బాగా పడిపోయినప్పుడు దిగుమతుల నుండి రైతులను రక్షించడం, స్థిరమైన వ్యవసాయం కోసం పర్యావరణ పునాదులను సమర్థవంతంగా పరిరక్షించడానికి, మెరుగుపరచడానికి ఎన్నికైన స్థానిక సంస్థలకు అధికారం ఇవ్వాలని సూచనలు చేశారు. సమగ్రాభివృద్ధి వేగవంతంగా జరగాలనే లక్ష్యంతో ఈ నివేదికను తయారు చేసినట్టుగా పేర్కొన్నారు. స్వామినాథన్ కమిషన్ చేసిన ప్రధాన సూచనలు ప్రతిపాదనలు పరిశీలిస్తే ఆయన ఎంతటి సామాజిక విప్లవకారుడో అర్థమవుతుంది.

దేశంలోని మెజారిటీ ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి ప్రభుత్వాలు తీసుకోవలసిన చర్యలను సవివరంగా నివేదికలో పొందుపరిచారు. ప్రభుత్వాలు తప్పక అనుసరించాల్సిన విషయాలను స్పష్టంగా తెలియజేశారు. కొన్ని అంశాలను పరిశీలిస్తే ఆ కాలంలో నక్సలైట్లకు ప్రభుత్వానికి జరిగిన చర్చల్లో ఉన్న డిమాండ్స్‌లోని చాలా అంశాలు అమలు చేయాలని జాతీయ రైతు కమిషన్ సూచించింది. భారతదేశ ప్రజల విషాదం ఏమిటంటే ఇప్పటికీ ఇందులో చాలా అంశాలు ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమంలో తీసుకున్న కొన్ని సానుకూల నిర్ణయాలు స్వామినాథన్ కమిషన్ రెకమెండేషన్స్ నుండి స్వీకరించినట్టుగా గమనించవచ్చు. భారత దేశంలోని పేద ప్రజల కోసం, వారికి ఆహారం పెట్టే వ్యవసాయ రంగం కోసం, వ్యవసాయం చుట్టూ ముడి వేసుకున్న భూమి సమస్య పరిష్కారం కోసం ఆయన చేసిన కృషి వలన హరిత విప్లవ పితామహుడుగా పేరు గాంచిన స్వామినాథన్, సామాజిక విప్లవకారునిగా ఎప్పటికీ నిలిచిపోతారు. ఆయన సేవల స్మరించుకొందాం. ఆయన సూచించిన ప్రతిపాదనలు అమలు చేయడమే సరియైన నివాళి.

 

ఎర్రోజు శ్రీనివాస్
(రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , తెలంగాణ వికాస సమితి)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News