Monday, April 7, 2025

సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ

- Advertisement -
- Advertisement -

మధురై మహాసభల్లో ఎన్నిక
18మందితో పొలిట్ బ్యూరో, 85 మందితో కేంద్ర కమిటీ

చెన్నై : సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శిగా కేరళ విద్యాశాఖ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. సిపిఎం మహాసభలు తమిళనాడులోని మదురైలో ఈ నెల 2న ప్రారంభమై 6వ తేదీన ఆదివారంతో ముగిసాయి. ఈ సందర్భంగా70 ఏళ్ల ఎంఏ బేబీని పార్టీ కొత్త కార్యదర్శిగా ఎన్నుకున్నారు. 18మందితో కొత్త పొలిట్ బ్యూరో, 85మందితో పార్టీ కేంద్ర కమిటీని కూడా ఎన్నుకున్నారు. అయితే ఈ సారి కేంద్ర కమిటీలో 25శాతం మంంది మహిళలు ఉండడం విశేషం.

ప్రధాన కార్యదర్శి పదవికి ఎంఏ బేబీ పేరును పార్టీ కోఆర్డినేటర్ ప్రకాష్ కారత్ ప్రతిపాదించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో సీతారాం ఏచూరి మృతి అనంతరం ఆ పదవి ఖాళీగా ఉంది. తాత్కాలికంగా కారత్ ఆ పదవిని నిర్వహిస్తూ వచ్చారు. మైనారిటీ కమ్యూనిటీ నుంచి సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తొలి నేత బేబీనే. ప్రధాన కార్యదర్శి పదవికి రేసులో సీనియర్ నేతలు అశోక్ ధవలే, బివి రాఘవులు, బృందా కారత్, మహ్మద్ సలీం తదితరులు పేర్లు ఉన్నప్పటికీ బేబీవైపే మొగ్గు చూపారు. ఇక పార్టీలో మరో వర్గం ఆలిండియా కిసాన్ సభ మాత్రం ధవలే పేరును గట్టిగా తెరపైకి తెచ్చినట్లు సమాచారం.

అంచలంచెలుగా ఎదిగిన నేత…

ఎంఎ బేబీ కొల్లాం జిల్లా ప్రక్కులాంలో పిఎం అలెగ్జాండర్, లిల్లీ దంపతులకు 1954లో జన్మించారు. బేబీ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఎస్‌ఎఫ్‌ఐ(అప్పట్లో కేరళ స్టూడెంట్ ఫెడరేషన్)లో పనిచేశారు. రాజనీతి శాస్త్రం అధ్యయనానికి డిగ్రీలో చేరినప్పటికీ దాన్ని పూర్తి చేయలేదు. ఆ తర్వాత అదే విభాగానికి జాతీయ అధ్యక్షుడు అయ్యారు. పార్టీ యువజన విభాగం డివైఎఫ్‌ఐలో పనిచేశారు. 1986 నుంచి 1998 వరకూ సిపిఎం రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు.

ఎమర్జెన్సీ కాలంలో విద్యార్థులను, యువతను సమీకరించి జైలుశిక్ష కూడా అనుభవించారు. 2006లో కేరళలోని కుందర నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 2006 నుంచి 2011 వరకూ విఎస్ అచ్యుతానంద్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2011లో తిరిగి కుందర నియోజకవర్గం నుంచే గెలుపొందారు. 2012 నుంచి సిపిఎం పొలిట్ బ్యూరోలో కొనసాగుతున్నారు. కాగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో కొల్లాం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాగా ఎంఏ బేబీకి భార్య, కుమారుడు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News