అనాథ కు పౌర సరఫరాల శాఖ డిటి ఆపన్న హస్తం
నల్లగొండ: పుట్టుకతో మానసిక వికలాంగుడైన ఓ అనాథ బాలుడి పట్ల అసాధారణ కారుణ్యం చూపారు పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాచన రఘునందన్. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా శౌలిగౌరారం మండలం అంబారీ పేట కు చెందిన ఓ కుటుంబం శనివారం నాడు నల్గొండ కలెక్టరేట్ కు ఓ పని నిమిత్తం వచ్చారు. విధి నిర్వహణ లో ఉన్న పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాచన రఘునందన్ వారిని వారితో పాటు ఉన్న ఓ పసి వాణ్ణి గమనించారు. వారికి అల్పాహారం కోసం ఆహ్వానించగా..బాలుడు (సృజన్) నడవడలేడని, పుట్టుక తోనే మానసిక వికలాంగుడని బాలుడి చిన్నాన్న నరేశ్ తెలిపారు.
దీంతో ఆ బాలుడి స్థితికి చలించి.. సృజన్ కు పూర్తి స్థాయి చికిత్స ఉచితంగా అందజేస్తానని మాచన హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో ఉన్న న్యూ లైఫ్ హోమియో కేర్ వైద్యులు డాక్టర్ గద్దె సుభాష్ చందర్ తో మాట్లాడారు. బాలుడి దీన స్థితి గురించి వివరించారు. సృజన్ కు పూర్తి ఉచిత చికిత్స అందించాలన్న తన సంకల్పాన్ని తెలియజేశారు. రఘునందన్ నిర్ణయాన్ని సుభాష్ చందర్ స్వాగతించారు. మాచన రఘునందన్ మానవత్వం పట్ల సృజన్ నాయనమ్మ హర్షం వ్యక్తం చేశారు. సామాజిక బాధ్యతగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు రఘునందన్ వివరించారు.