Thursday, January 23, 2025

ముగిసిన నవదీప్ ఇడి విచారణ

- Advertisement -
- Advertisement -

నైజీరియన్లతో సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపైనే ప్రధాన ఆరా

మన తెలంగాణ/హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీనటుడు నవదీప్ పల్లపోలు ఇడి విచారణ ముగిసింది. 10 గంటల పాటు ఆయనను ఇడి అధికారులు విచారించారు. విదేశీ డ్రగ్స్ పెడ్లర్స్‌తో ఆర్ధిక లావాదేవీలు, మనీలాండరింగ్‌పై ఇడి ఆరా తీసినట్లు సమాచారం. నవదీప్‌కు చెందిన ప్రొడక్షన్ హౌస్, వ్యక్తిగత ఖాతాలపైనా వివరాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. అలాగే ఆయనకు సంబంధించిన మూడు బ్యాంక్ ఖాతాలు, నవదీప్ నడిపిన పబ్ వివరాలు, నైజీరియన్లతో సంబంధాలపై ఇడి ఆరా తీసినట్లు సమాచారం. కాగా 2017లో సినీ పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్ కుంభకోణంలో విచారణ నిమిత్తం అక్టోబర్ 10న జాతీయ ఏజెన్సీ ముందు హాజరుకావాలని తెలుగు నటుడు నవదీప్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులు నోటీసులు జారీ చేశారు. సిఆర్‌పిసిలోని సెక్షన్ 41ఎ కింద హాజరుకావాలని కోరుతూ నటుడికి నోటీసులు అందాయి.

సెప్టెంబరులో గుడిమల్కాపూర్ పోలీసులు బుక్ చేసిన కేసుకు సంబంధించి తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టిఎస్‌ఎన్‌ఎబి) ఇటీవల నవదీప్‌ను ప్రశ్నించింది. అరెస్టు చేసిన నైజీరియన్ డ్రగ్ పెడ్లర్లతో కాంటాక్ట్‌లో నటుడు ఉన్నాడని ఆరోపించబడ్డాడని టిఎస్‌ఎన్‌ఎబి డైరెక్టర్ సివి ఆనంద్ తెలిపారు. టాలీవుడ్ డ్రగ్స్ కుంభకోణానికి సంబంధించి నవదీప్‌కు ఇడి గతంలో రెండుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ , అతను విచారణకు హాజరుకాలేకపోయాడు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ టిఎస్‌ఎన్‌ఎబి నుండి ప్రస్తుత డ్రగ్ కేసు వివరాలను సేకరించి దర్యాప్తును కొనసాగించవచ్చు. కాగా, హైకోర్టు అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో నవదీప్‌కు సిఆర్‌పిసి సెక్షన్ 41ఎ కింద నోటీసులు అందాయి. ‘పాత టాలీవుడ్ డ్రగ్స్ అక్రమ రవాణా కేసుకు సంబంధించి తాము అతనికి సమన్లు పంపాము. ప్రస్తుత కేసును కూడా అందులో చేర్చుతాము. నవదీప్‌కు రెండుసార్లు సమన్లు వచ్చాయి, కానీ అతను మా ముందు హాజరుకాలేకపోయాడు’ అని ఇడి వర్గాలు పేర్కొన్నాయి. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ను ఎ29 గా పోలీసులు పేర్కొన్నారు. ఆయనను డ్రగ్స్ వినియోగదారుడుగా పేర్కొన్న పోలీసులు నవదీప్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు.

సెప్టెంబర్ 16వ తేదీన హైదరాబాద్‌లోని నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు సోదాలు నిర్వహించారు. నవదీప్ కేసు నుంచి తప్పించుకోవడానికి మాదాపూర్ డ్రగ్స్ కేసులో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కోర్టు ద్వారా పోరాటం చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌, అరెస్ట్ అయిన రామ చందర్ అనే వ్యక్తితో తనకు పరిచయం ఉన్న మాట వాస్తవమేనని, కానీ తాను ఎక్కడ డ్రగ్స్ తీసుకోలేదని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన రామచందర్ తో తనకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, కానీ డ్రగ్స్ కేసులో కాదని నవదీప్ చెబుతున్నారు. నార్కోటిక్ పోలీసుల విచారణకు హాజరయినప్పుడు అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని, అవసరం ఉంటే మళ్లీ పిలుస్తామని వారు చెప్పారని నవదీప్ విచారణ అనంతరం పేర్కొన్నారు. ఇక ఈ కేసులో నార్కోటిక్స్ బ్యూరో అధికారుల కేసు ఆధారం చేసుకుని, ఇడి అధికారులు నవదీప్ పై కేసు నమోదు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News