ముంబై: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తన సోదరి సుప్రియా సూలెపై తన భార్య సునేత్ర పవార్‌ను పోటీకి నిలబెట్టి తప్పు చేశానని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పశ్చాత్తాపం ప్రకటించారు. రాజకీయాలు ఇంట్లోకి ప్రవేశించడానికి అనుమతించకూడదని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జన సమ్మాన్ యాత్ర చేపట్టిన అజిత్ పవార్ ఒక మరాఠీ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ తాను సోదరీమణులందరినీ ప్రేమిస్తానని చెప్పారు. రాజకీయాలు ఇంట్లోకి ప్రవేశించడానికి ఎవరూ అనుమతించకూడదని ఆయన అన్నారు.
తన సోదరికి వ్యతిరేకంగా తన భార్యను ఎన్నికల్లో పోటీ చేయించి తాను తప్పుచేశానని ఆయన అన్నారు. అలా జరగకుండా ఉండవలసిందని కూడా ఆయన చెప్పారు. అయితే ఎన్‌సిపి పార్లమెంటరీ బోర్డు ఆ నిర్ణయం తీసుకుందని, ఆ నిర్ణయం తప్పని తాను భావిస్తున్నానని అజిత్ పవార్ తెలిపారు. వచ్చేవారం రక్షాబంధన్ రోజున మీ సోదరి సుప్రియా సూలె కలసి రాఖీ కట్టించుకుంటారా అన్న ప్రశ్నకు తాను ప్రస్తుతం యాత్రలో ఉన్నానని, ఆ రోజున తన సోదరి, తాను ఒకే చోట ఉన్న పక్షంలో తప్పకుండా రాఖీ కట్టించుకుంటానని అజిత్ పవార్ వెల్లడించారు. అభివృద్ధి, రైతులు, మహిళలు, యువనులకు సంబంధించిన సంక్షేమ పథకాలపై తాను మాట్లాడతానని, తనపై చేసే విమర్శలకు స్పందించబోనని ఆయన స్పష్టం చేశారు.
తన బాబాయ్ శరద్ పవార్‌తో విభేదాల గురించి అడిగిన ప్రశ్నించగా ఆయన(శరద్ పవార్) సీనియర్ నాయకుడని, తమ కుటుంబ పెద్దని అజిత్ పవార్ తెలిపారు. ఆయన తనపై చేసే విమర్శలపై తాను వ్యాఖ్యానించబోనని అజిత్ పవార్ తెలిపారు. శరద్ పవార్‌పై అధికార బిజెపి, శివసేన చేస్తున్న ఆరోపణల గురించి ప్రశ్నించగా తాము ఏమి మాట్లాడుతున్నామో మహాయుతి భాగస్వామ్య పక్షాలు అర్థం చేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. తాము సమావేశమైనపుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తానని ఆయన చెప్పారు.