ఇస్రో చరిత్రలో ఇదో మైలురాయిగా శాస్త్రవేత్తల ప్రశంస
బెంగళూరు : అంగారక గ్రహంపై పరిశోధనలకు ఉద్దేశించి భారత్ పంపిన వ్యోమనౌక ప్రోబ్ జీవితకాలం కేవలం ఆరునెలలుగా రూపొందించినప్పటికీ ఏడేళ్లు పూర్తి చేసుకోవడం భారత అంతరిక్ష పరిశోధనలో ఒక మైలురాయిగా చెప్పవచ్చు. నిజంగా ఇదో సంతృప్తికరమైన అనుభవమని ఇస్రో( ఇండియన్ స్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్ ) మాజీ ఛైర్మన్ కె. రాధాక్రిష్ణన్ అభివర్ణించారు. ఇస్రో చేపట్టిన తొలి గ్రహాంతర మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్ (ఎంఒఎం). ఆనాడు ఈ మిషన్‌కు రాధాక్రిష్ణన్ నేతృత్వం వహించారు. 2013 నవంబర్ 5 న ఇస్రో దీన్ని విజయవంతంగా ప్రయోగించింది. 2014 సెప్టెంబర్ 24 న అంగారక కక్ష లోకి ప్రోబ్ ప్రవేశించ గలిగింది. ఈ మిషన్ నుంచి ఇస్రో అనేక పాఠాలను నేర్చుకోగలిగింది. ప్రోబ్‌ను డిజైన్ చేయడం నుంచి కక్ష లోకి ప్రోబ్‌ను ప్రవేశ పెట్టడం వరకు అనేక సాంకేతిక అంశాలపై పరిజ్ఞానం పెంపొందించుకోగలిగింది.
భవిష్యత్ గ్రహాంతర మిషన్లు చేపట్టడానికి ఇస్రోకు నమ్మకం పెరిగింది. మంగళయాన్ ప్రయోగ కార్యక్రమ డైరెక్టర్‌గా పనిచేసిన ఎం. అన్నాదురై ఈ సందర్భంగా వ్యోమనౌక సమర్ధంగా పనిచేస్తుందని, సాంకేతికంగా ఎదురౌతున్న కొన్ని ఇబ్బందులను అధిగమించవలసి ఉందని చెప్పారు. ఈ వ్యోమనౌక మరో ఏడాది వరకు చక్కగా పనిచేస్తుందన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. చంద్రయాన్ 1 ప్రయోగం నుంచి ఇస్రో కొన్ని అనుభవాలను తెలుసుకుందని, వ్యోమనౌక పునరుద్ధరణ, ఇంధన నిర్వహణ సామర్ధం ఇవన్నీ బాగా తెలిశాయని చెప్పారు. భూ వాతావరణ రిమోటింగ్ సెన్సింగ్ శాటిలైట్లకు ఏడు నుంచి తొమ్మిదేళ్ల వరకు జీవితకాలం ఉంటుందని, కానీ అంగారక గ్రహం చుట్టూ వ్యోమనౌక సుదీర్ఘకాలం పనిచేసేలా భారత్ తన సామర్ధాన్ని చూపించగలగడం సంతోషంగా ఉందన్నారు.