సెప్టెంబర్-అక్టోబర్ వరకల్లా..
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్
హైదరాబాద్: రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ఉత్పత్తి సెప్టెంబర్-అక్టోబర్ వరకల్లా భారత్‌లో ప్రారంభమవుతుందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ లిమిటెడ్ తెలిపింది. రష్యా నుంచి స్పుత్నిక్ వి దిగుమతులు ఆలస్యం కావడానికి కారణం ఆ దేశంలో అకస్మాత్తుగా కొవిడ్ కేసులు పెరగడమేనని డాక్టర్ రెడ్డీస్ బ్రాండెడ్ మార్కెట్స్ సిఇఒ ఎంవి రమణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు చివరి వరకల్లా అక్కడి నుంచి దిగుమతులు రాగలవని అంచనా వేస్తున్నామన్నారు. మన దేశంలోని ఉత్పత్తిదారులు ప్రస్తుతం వ్యాక్సిన్ సాంకేతికతను బదిలీ చేసుకునే ప్రక్రియలో ఉన్నారని ఆయన తెలిపారు. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన రష్యా అధికారిక సంస్థ ఆర్‌డిఐఎఫ్‌తో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
25 కోట్ల స్పుత్నిక్ వి వయల్స్‌ను భారత్‌లో అమ్మడానికి ఈ ఒప్పందం జరిగింది. రెండు వయల్స్ చొప్పున 12.50 కోట్లమందికి అవి సరిపోతాయి. 80 నగరాల్లో ఇప్పటి వరకు ఈ వ్యాక్సిన్‌ను 2.50 లక్షలమందికి పంపిణీ చేసినట్టు రెడ్డీస్ ల్యాబ్ అధికారి ఒకరు తెలిపారు. రష్యా టీనేజర్లపై నిర్వహిస్తున్న స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ప్రయోగాలు అక్టోబర్ వరకల్లా పూర్తి కానున్నట్టు ఆయన తెలిపారు. స్పుత్నిక్ వి తయారీకి భారత్‌లోని ఆరు ఔషధ కంపెనీలతో ఆర్‌డిఐఎఫ్ ఒప్పందాలు కుదుర్చుకున్నది.