Sunday, January 19, 2025

మాదాపూర్ డ్రగ్స్ కేసులో ప్రముఖుల పేర్లు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః మాదాపూర్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. సినీనిర్మాతను అరెస్టు చేసిన పోలీసులు చిత్రపరిశ్రమకు చెందిన 24మంది నిందితుల పేర్లను చేర్చినట్లు తెలుస్తోంది. గతంలో డ్రగ్స్ కేసుల్లో వచ్చిన పేర్లను రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు చెందిన బాలాజీ, వెంకట్ బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చి నగరంలోని విక్రయిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. వెంకట రత్నాకర్ రెడ్డి డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా విక్రయిస్తున్నాడు. డ్రగ్స్ ఏర్పాటు చేసి మాదాపూర్‌లోని అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నాడు. రోజు తప్పి రోజు రేవ్ పార్టీ నిర్వహించి పలువురు ప్రముఖులను దానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా బాలాజీ, వెంకట్ వాట్సాప్ ఛాటింగ్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. డ్రగ్స్ కోసం వీరిని సంప్రదించిన వారు వినియోగదారులా లేక విక్రయదారులా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో 18మంది వెంకట్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

అలాగే వీరి బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నారు. వీరికి డ్రగ్స్ కోసం ఎవరెవరు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారనే వివరాలు తెలుసుకుని అదుపులోకి తీసుకునేందుకు హెచ్‌న్యూ అధికారులు సిద్ధమవుతున్నారు. వెంకట్ డ్రగ్స్ విక్రయించడమే కాకుండా సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని చెప్పి పలువురు యువతులను తీసుకుని వచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలిసింది. ఇతడిపై ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో 29పైగా కేసులు నమోదు అయినట్లు తెలిసింది. ఈ డ్రగ్స్ కేసులో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.అందులో ముగ్గురు నైజీరియన్లు, ఒకరు విశాఖపట్టణానికి చెందిన రాము ఉన్నారు. వారిని పట్టుకునేందుకు నార్కోటిక్ బ్యూరో పోలీసులు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన వెంకటరత్నాకర్ రెడ్డి, బాలాజీ, మురళీని పోలీసులు శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. నిందితులకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఐఆర్‌ఎస్ పేరుతో మోసం….
తాను ఐఆర్‌ఎస్ అధికారినంటూ వెంకట రత్నాకర్ రెడ్డి పలువురిని మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఇద్దరు సినీ నిర్మాతల నుంచి రూ.30లక్షలకు పైగా వసూలు చేసినట్లు తెలిసింది. ఓ అధికారిని వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేసినట్లు తెలిసింది. వెంకటరత్నాకర్‌రెడ్డితో సన్నిహితంగా ఉంటే వారి గురించి ఆరా తీస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఎక్కడి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశాడు. వాటిని నగరానికి ఎలా తీసుకుని వచ్చేవాడు, దీనికోసం ఏవరిని ఏర్పాటు చేసుకున్నాడు, నైజీరియన్లతో వెంకట్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా వెంకట్ ఇచ్చిన డ్రగ్స్ పార్టీకి హాజరైన వారి వివరాలు తీసుకుంటున్నారు. కొకైన్, ఎల్‌ఎస్‌డి, గంజాయితోపాటు ఇంకా ఏ తరహా డ్రగ్స్ విక్రయిస్తున్నాడో విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News