Wednesday, January 22, 2025

పిసిసి వచ్చినా.. ఇంకే పదవి దక్కినా అణకువగా వుండాలి: మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులపై మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిసిసి అయినా, ఇంకేదైనా పదవి వచ్చినోళ్లు అణుకువగా వుండాలని మధుయాష్కీ హితవు పలికారు. తాము ఎవరికీ వ్యతిరేకంగా సమావేశాలు పెట్టలేదని, పార్టీ బాగు కోసం సమావేశం పెట్టామన్నారు. తమకు సీనియర్లు, జూనియర్లు అనే భేదం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు మంచి రోజులు రావాలని, వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ఇప్పుడు బిఆర్‌ఎస్ పార్టీలో తెలంగాణ పేరు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసమైతే తెలుగు రాష్ట్రాల విభజన కోసం ఎందుకు కొట్లాడావంటూ బిఆర్‌ఎస్‌పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జీ వచ్చాక సమిష్టిగా నిర్ణయాలుంటాయని తెలిపారు. కర్ణాటకలో బస్సు యాత్ర చేస్తున్నారని, తెలంగాణలోనూ చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకపోతే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగోర్ స్థానంలో కొత్తగా మాణిక్ రావ్ థాక్రేను హైకమాండ్ నియమించింది. అటు మాణికం ఠాగూర్‌కు గోవా ఇంచార్జిగా బాధ్యతలు అప్పగిస్తూ ఎఐసిసి ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కెసి వేణుగోపాల్ పేరిట బుధవారం ప్రకటన విడుదలైంది. అంతకుముందే మాణికం ఠాగూర్ తెలంగాణ ఇంఛార్జీ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి విదితమే.

కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకు ఆయన రాజీనామా లేఖ సమర్పించిన కొద్దిసేపటికే హైకమాండ్ నుంచి ప్రకటన విడుదలైంది. కాగా గత కొంతకాలంగా ఠాగూర్‌ను కాంగ్రెస్ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విభేదాలు చక్కదిద్దేందుకు దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగారు. ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితులపై రిపోర్టుతో తెలంగాణకి కొత్త ఇన్‌ఛార్జ్‌ని నియమించాలని హైకమాండ్ నిర్ణయించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. తమ మాటకు గాంధీ భవన్‌లో విలువ వుండటం లేదని సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన పలువురు నేతలు ఠాగూర్‌పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News