Wednesday, January 22, 2025

రాజుల కోటలో రాజకీయ కురుక్షేత్రం

- Advertisement -
- Advertisement -

మధ్యప్రదేశ్ గుణ జిల్లాలో పట్టు కోసం కాంగ్రెస్, బిజెపి హోరాహోరీ
దిగ్విజయ్, సింధియాల ఆధిపత్యానికి పరీక్ష

భోపాల్: రాజ కుటుంబాల కంచుకోట అయిన మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులయిన కాంగ్రెస్, బిజెపిల మధ్య కురుక్షేత్రంగా మారింది. గుణ జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు రాఘోఘర్, చచౌరా, బమోరి, గుణ ఉన్నాయి.ఈ నాలుగింటిలో రెండు నియోజకవర్గాలు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కుటుంబ సభ్యుల చేతిలో ఉండగా, మిగతా రెండు నియోజకవర్గాలు అధికార బిజెపి చేతిలో ఉన్నాయి. దిగ్విజయ్ సింగ్ ఒకప్పటి గ్వాలియర్ సంస్థానానికి చెందిన రాఘోఘర్ సంస్థానానికి చెందిన వారు కాగా, గుణ లోక్‌సభ స్థానం ఎంపి, కేంద్ర మంత్రి అయిన జ్యోతిరాదిత్య సింధియా ఒకప్పటి గ్వాలియర్ రాజవంశీకుడు.

గుణ జిల్లా గత కొన్నేళ్లుగా దిగ్విజయ్,సింధియాల రాజకీయ కురుక్షేత్రంగా ఉంటోంది. 2002లో విమాన ప్రమాదంలో తన తండ్రి, మాజీ కేంద్ర మంత్రి మాధవరావు సింధియా మృతి చెందడంతో జ్యోతిరాదిత్య సింధియా తొలిసారి గుణ లోక్‌సభ స్థానంనుంచి పోటీ చేశారు. ‘రాఘోఘర్ సంస్థానం ఒకనాటి గ్వాలియర్ సామ్రాజ్యంలో భాగంగా ఉండింది. దిగ్విజయ్ తనకు విశ్వాసపాత్రుడిగా ఉండారని సింధియాలు ఆశించారు కానీ అలా జరగలేదు. దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, మాధవరావు సింధియా ఓ ఫాక్షన్ లీడర్‌గా మారడంతో ఇద్దరి మధ్య శత్రుత్వం మరింత తీవ్రమైంది’ అని సింధియాలపై రాసిన పుస్తకంలో సీనియర్ జర్నలిస్టు రషీద్ కిద్వాయి పేర్కొన్నారు.

1977నుంచి కూడా రాఘోఘర్ అసెంబ్లీ నియోజకవర్గం దిగ్విజయ్ సింగ్ కుటుంబ సభ్యుల చేతిలోనే ఉంది. 1985, 2008లో మాత్రం ఆయన ముఖ్య అనుచరుడు మూల్ సింగ్ అక్కడినుంచి గెలుపొందారు. దిగ్విజయ్ సింగ్ కుమారుడు జైవర్ధన్ సింగ్ ప్రస్తుతం అక్కడ ఎంఎల్‌ఎగా ఉన్నారు.2013లో తొలిసారి ఇక్కడినుంచి ఎన్నికయిన జైవర్ధన్ 2018 ఎన్నికల తర్వాత ఏర్పడిన కమల్‌నాథ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. అయిదు సార్లు రాజ్‌ఘర్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన లక్ష్మణ్ సింగ్ రెండు పార్లు( 1990, 93) రాఘోఘర్ అసెంబ్లీ స్థానానికి కూడా ప్రాతినిధ్యం వహించారు.2004లో బిజెపిలో చేరిన ఆయన 2013లో తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారు. రాఘోఘర్, చచైరా అసెంబ్లీ స్థానీఆలు ప్రస్తుతం బిజెపి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్‌ఘర్ పార్లమెంటు స్థానంలో భాగంగా ఉన్నాయి. ఇక 1957నుంచి సింధియాలు గుణ లోక్‌సభ స్థానానికి ప్రాతనిధ్యం వహిస్తున్నారు.

నాలుగు సార్లు మాత్రం వేరే వాళ్లు నెగ్గారు. శివ్‌పురి జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలు, గుణ జిల్లాకు చెందిన రెండు అసెంబ్లీ స్థానాలు, అశోక్ నగర్ జిల్లానుంచి మూడు అసెంబ్లీ స్థానాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో ఆరు బిజెపి చేతిలో ఉండగా, రెండు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి, 2019లో జ్యోతిరాదిత్య సింధియా బిజెపినుంచి పోటీ చేసిన కెపి యాదవ్ చేతిలో ఓడిపోయారు. సింధియా ఓటమికి దిగ్విజయ్, కమల్‌నాథ్‌లే కారణమని ఆయన వర్గం ఆరోపిస్తూ వచ్చింది.

సింధియా వర్గానికి చెందిన ఎంఎల్‌ఎలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరడం ద్వారా కమల్‌నాథ్ ప్రభుత్వం పడిపోయేలా చేయడం ద్వారా ఆయన వారిపై ప్రతీకారం తీర్చుకున్నారు. దీంతో మరోసారి బిజెపి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలను గెలుచుకుంటుందని కాంగ్రెస్ వర్గాలు ధీమాగా చెబుతున్నారు. సింధియా, ఆయన వర్గ్గీయులు బిజెపికి అమ్ముడు పోయారని కూడా ఆ పార్టీ వారు ఆరోపిస్తున్నారు. అయితే ఆయా నియోజకవర్గాల చరిత్ర మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎవరి అంచనాలు నిజమవుతాయో వేచి చూడాలి. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న ఒకే విడతలో పోలింగ్‌జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News