ముద్దుగా, బొద్దుగా ఉన్న ఆ కుక్కపిల్లను చూస్తే ఎవరైనా ముద్దు చేస్తారు. కానీ ఆ కిరాతకుడు మాత్రం అమాంతం దాన్ని ఎత్తి నేలకేసి కొట్టాడు. అంతటితో ఊరుకోలేదు, కొన ఊపిరితో కొట్టుకుంటున్న ఆ మూగప్రాణిపై కాలు వేసి తొక్కి మరీ చంపేశాడు. మధ్యప్రదేశ్ లోని గుణజిల్లాలో రాధాపూర్ కాలనీలో శనివారం జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చివరకు ముఖ్యమంత్రి చౌహాన్ సైతం ఈ దారుణం పట్ల కలత చెందారు. మానవత్వంలేని ఆ మృగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రాధాపూర్ కాలనీకి చెందిన మృత్యుంజయ్ జదావ్ అనే వ్యక్తి రోడ్డు పక్కన కూర్చుని ఏదో తింటున్నాడు. అంతలో అతని వద్దకు ఓ కుక్కపిల్ల తోకాడించుకుంటూ వచ్చింది. తను తినేదాంట్లో కొంచెం పెడతాడేమోనని ఆశ పడింది. కానీ. ఆ దుర్మార్గుడు అమాంతం ఆ బుజ్జి కుక్కపిల్లను ఎత్తి నేలకేసి కొట్టి, కాలితో తొక్కి చంపేశాడు. సీసీటీవీల్లో రికార్డయిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలను చూసిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా “ఇది దారుణం. అమానుషం. నిందితుడిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది” అని కామెంట్ చేస్తూ, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను టాగ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ నిందితుడి ప్రవర్తన హేయమైనదనీ, కఠినంగా శిక్షిస్తామనీ పేర్కొన్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు మృత్యుంజయ్ కి మతిస్థిమితం లేదని అనుమానిస్తున్నారు.