మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక నర్సింగ్ కళాశాల చైర్మన్ నుంచి రూ. 10 లక్షల లంచం పుచ్చుకుంటూ సిబిఐకి చిక్కిన సిబిఐ ఇన్‌స్పెక్టర్ రాహుల్ రాజ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ బుధవారం సర్వీసుల నుంచి బర్తరఫ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అవినీతి పట్ల ఏమాత్రం ఉపేక్షించేది లేదన్న విధానానికి లోబడి రాహుల్ రాజ్‌ను రజ్యాంగంలోని 311 అధికరణ కింద ఉద్యోగం నుంచి తొలగించినట్లు అధికారులు వివరించారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా ఉన్న తమ డిఎస్‌పి ఆశిష్ ప్రసాద్‌ను ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేసినట్లు సిబిఐ తెలిపింది. మధ్య ప్రదేశ్ పోలీసు శాఖ నుంచి సిబిఐకి డిప్యుటేషన్‌పై వచ్చిన సుశీల్ కుమార్ మజోక, రిషి కాంత్ అసాథెలను త్వరలోనే రాష్ట్ర పోలీసు శాఖకు తిప్పి పంపనున్నట్లు అధికారులు తెలిపారు.
మలే నర్సింగ్ కాలేజ్ చైర్మన్ అనీల్ భాస్కరన్, ఆయన భార్య సుమన్ అనీల్ నుంచి రూ. 10 లక్షల లంచం పుచ్చుకుంటూ ఆదివారం రాహుల్ రాజ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నర్సింగ్ కళాశాల చైర్మన్ దంపతులను కూడా అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్ కాలేజీలకు అనుకూలంగా తనిఖీ నివేదికలు ఇవ్వడానికి లంచం పుచ్చుకున్నారన్న ఆరోపణలపై రాహుల్ రాజ్‌తోసహా 13 మందిని సిబిఐ ఇప్పటివరకు అరెస్టు చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశం మేరకు సిబిఐ ఏర్పాటు చేసిన బృందాలకు చెందిన కొందరు అధికారులు నర్సింగ్ కాలేజీల నుంచి లంచం పుచ్చుకుని తప్పుడు నివేదికలు ఇస్తున్నట్లు సిబిఐకి చెందిన అంతర్గత నిఘా విభాగం నుంచి సమాచారం అందడంతో సిబిఐ చర్యలకు ఉపక్రమించింది. నర్సింగ్ కాలేజీలలో మౌలిక సౌకర్యాలు, ఫ్యాకల్టీకి సంబంధించి ఈ బృందాలు తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది.