చెన్నై : ఎఐఎడిఎంకె జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని మళ్లీ నిర్వహించాలని మద్రాస్ హైకోర్టు బుధవారం రూలింగ్ ఇచ్చింది. జూన్ 23 నాటికి ఉన్న స్థితి యథాతధంగా కొనసాగుతుందని తెలిపింది. జస్టిస్ జీ జయచంద్రన్ ఈ రూలిలంగ్ ఇచ్చారు. దీంతో ఆ పార్టీ నేత ఓ పన్నీర్‌సెల్వంకు గొప్ప ఊరట లభించింది. కో ఆర్డినేటర్, జాయింట్ కో ఆర్డినేటర్ సమ్మతి లేకుండా జనరల్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించరాదని చెప్పింది. ఈ పిటిషన్ పై మొదట జస్టిస్ కృష్ణన్ రామస్వామి విచారణ జరిపారు. ఓపీఎస్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి మేరకు జస్టిస్ జీ జయచంద్రన్ బెంచ్‌కు బదిలీ చేశారు. జులై 11న నిర్వహించిన ఎఐఎడిఎంకె జనరల్ కౌన్సిల్ మీటింగ్ చెల్లదని ఓపీఎస్ తరఫు న్యాయవాది వాదించారు.
కో ఆర్డినేటర్, జాయింట్ కో ఆర్డినేటర్ పోస్టులను దర్దు చేసినట్లయితే ద్వంద్వ నాయకత్వం నియమించిన జనరల్ కౌన్సిల్ సభ్యులు ఏ విధంగా తమ పదవుల్లో కొనసాగుతారని ప్రశ్నించారు. జూన్ 23 న ప్రిసీడియం ఛైర్మన్‌కు సంబంధించిన తీర్మానం చేయడానికి ముందే ఓపీఎస్ ఆ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లి పోయారని తెలిపారు. బైలాస్ ప్రకారం సమావేశం నిర్వహణకు కో ఆర్డినేటర్ అవసరమని పేర్కొన్నారు. ఈ వాదనలను ఎడపాడి పళనిస్వామి (ఇపిఎస్) తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు. తాత్కాలిక జనరల్ సెక్రటరీ గా ఈపీఎస్‌కు 2500 మంది కౌన్సిల్ సభ్యులు ఓటు వేశారని తెలిపారు. నాలుగు నెలల్లోగా ఎన్నికలను నిర్వహిస్తామన్నారు.