Saturday, November 23, 2024

ఇరకాటంలో ఇసి

- Advertisement -
- Advertisement -

Madras High court slams Election commission

 

కరోనా రెండో కెరటం దేశంలో ఇంతగా విర్రవీగి విజృంభించడానికి నువ్వే, ముమ్మాటికీ నువ్వే కారణమని ఎన్నికల సంఘాన్ని ఒక రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వేలెత్తి చూపడం చిన్న విషయం కాదు. రాజ్యాంగ సంస్థల వైఫల్యం తరచూ రుజువవుతున్నా కిమ్మనకుండా భరిస్తున్న దేశ ప్రజల మౌన వేదనను మద్రాసు హైకోర్టు సోమవారం నాడు తీవ్రమైన పదజాలంతో వ్యక్తం చేసింది. ఐదు అసెంబ్లీల ఎన్నికల ఘట్టంలో ఎలెక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు నిజంగానే అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని బ్యాలట్ పోరు సాగిస్తున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను 8 దశలుగా విభజించడం విస్మయపరిచింది. ఆ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం జరిపి ఓటర్లను తనవైపు తిప్పుకొని తాను కోరుకున్న విజయాన్ని సాధించుకోడానికి కేంద్ర పాలకులు ఎన్నికల సంఘం మెడలు వంచి అక్కడ పోలింగ్‌ను 8 విడతలకు పొడిగింపజేశారనే విమర్శ వాటి తేదీలను ప్రకటించినప్పుడే దూసుకు వచ్చింది.

కాని మీడియా ఈ అంశానికి తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదు. ఎన్నికల ప్రచారానికి భారీ బహిరంగ సభలు నిర్వహించి జనాన్ని లక్షలాదిగా ఒక్క చోట చేర్చినందువల్ల ఆ సభలు కరోనాను ఎంతగా వ్యాప్తి చెందిస్తాయో చెప్పనక్కర లేదు. మాస్కులు కూడా లేకుండా వేలు లక్షలాది మంది జనం గంటల తరబడి ఒక చోట కూచుంటే మంది ప్రాణాలను మహమ్మారి ఆకలి తీరా విందు చేసుకుంటుందనే ఇంగితం కూడా లోపించి ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర వహించిన మాట వాస్తవం. భారీ ఎన్నికల సభలు జరపకుండా రాజకీయ పార్టీలను నివారించలేకపోయిన ఇసియే దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్‌కు కారణమని ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ బెనర్జీ, న్యాయమూర్తి సెంథిల్ కుమార్ రామమూర్తిల ధర్మాసనం పేర్కొన్నది. 77 మంది అభ్యర్థులు పోటీ చేసిన కరూర్ నియోజక వర్గం ఓట్ల లెక్కింపు పకడ్బందీ కొవిడ్ జాగ్రత్తలతో జరిపేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. అంతేకాదు ఎన్నికల సంఘం అధికారులపై హత్య కేసులు పెట్టాలని అన్నది. ఎన్నికల ప్రచార సభలు జరుగుతున్నప్పుడు మీరేం చేస్తున్నారు, ఇతర గ్రహాల్లో విశ్రాంతి చిత్తగిస్తున్నారా అని ఘాటుగా ప్రశ్నించింది. బహుశా మన ఎన్నికల సంఘం తన చరిత్రలో ఎన్నడూ ఇటువంటి న్యాయాభిశంసనకు గురై ఉండదు.

మే 2 నాటి ఓట్ల లెక్కింపు ఘట్టం గట్టి కొవిడ్ జాగ్రత్తలతో జరిగేలా చూడాలని అందుకు ఉద్దేశించిన కార్యాచరణను ఈ నెలాఖరుకు తనకు సమర్పించాలని లేకుంటే కౌటింగ్‌ను నిలిపివేస్తానని కూడా ధర్మాసనం హెచ్చరించింది. ప్రధాని మోడీ సహా పెద్దలందరూ ఎడాపెడా ఎన్నికల సభల్లో మాట్లాడి కరోనా విపత్తును ఇంతగా రెచ్చగొట్టారనేది కొట్టిపారేయలేని కఠోర వాస్తవం. వారిని కూడా కట్టడి చేసి సభలు జరపకుండా, అవసరమైతే ఎన్నికలను వాయిదా వేసే అధికారాలున్న ఎన్నికల సంఘం వాటిని ఇంతటి జాతీయ విపత్తు సమయంలో ఎందుకు ప్రయోగించలేదనేది సబబైన ప్రశ్న. నిర్ణీత వ్యవధికి లోబడి ఎన్నికలను వాయిదా వేసే, నిలుపుదల చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. గడువులోగా ఎన్నికలు నిర్వహించలేనని అది తెలియజేస్తే కేంద్రం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధింప చేయవచ్చునని కూడా నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలను వాయిదా వేసిన సందర్భాలున్నాయి.1991లో పార్లమెంటు ఎన్నికలు సగంలో ఉన్నప్పుడు తమిళనాడులో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. అప్పుడు తదుపరి ఎన్నికల ఘట్టాన్ని మూడు వారాల పాటు వాయిదా వేశారు.

ఇటీవల 2020 మార్చిలో 18 రాజ్యసభ స్థానాల ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఎన్నికల సంఘానికి, దాని అధికారులకు తమకున్న అధికారాల గురించి తెలియవని అనుకోలేము. కొవిడ్ ఇంతగా విజృంభిస్తున్నప్పుడు మూలనున్న సంచిలో నుంచి వాటిని బయటికి తీసి ప్రయోగించి ఉండవలసింది. ఏ కారణం వల్లనో అది జరగలేదు. ప్రజల ప్రాణ రక్షణ బాధ్యత మిగతా అన్నింటికంటే ఉత్కృష్టమైనదని భావించిన మద్రాసు హైకోర్టు ధర్మాసనం నిద్రపోతున్న ఎన్నికల సంఘాన్ని తట్టిలేపి ఈ విధంగా తూర్పారబట్టడం ఎంతైనా సమంజసంగా ఉంది. వాస్తవానికి మన వంటి సువిశాల ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల నిర్వహణ ఘట్టం పూర్తి తటస్థ వాతావరణంలో జరగాలి. ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న రాజకీయ శక్తులు చేతులు ముడుచుకొని కూర్చునేలా చేయాలి. ఆ సమయంలో పాలనాధికారాలు కూడా తటస్థ సంస్థ హస్తగతమై ఉండడం అవసరం. లేని పక్షంలో ఎంతటి గొప్ప రాజ్యాంగ సంస్థల అధికారాలైనా ఇలా దుర్వినియోగమై దేశ ప్రజల ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News