మాడ్రిడ్ : ప్రతిష్టాత్మకమైన మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్), అరినా సబలెంకా (బెలారస్)) టైటిల్స్ సాధించారు. హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ అల్కరాజ్ 64, 36, 63 తేడాతో జర్మనీకి చెంని జాన్ లెనార్డ్ స్ట్రఫ్‌ను ఓడించాడు. తొలి సెట్‌లో పోరు ఆసక్తికరంగా సాగింది. ఇటు అల్కరాజ్ అటు స్ట్రఫ్ ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో సెట్‌లో హోరాహోరీ తప్పలేదు. కానీ కీలక సమయంలో స్ట్రఫ్ ఒత్తిడికి గురయ్యాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న అల్కరాజ్ సెట్‌ను దక్కించుకున్నాడు. కానీ రెండో సెట్‌లో మాత్రం స్ట్రఫ్ పుంజుకున్నాడు. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శిస్తూ సెట్‌ను సొంతం చేసుకున్నాడు.
అయితే కీలకమైన మూడో సెట్‌లో మళ్లీ అల్కరాజ్ ఆధిపత్యం చెలాయించాడు. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లోనూ హోరాహోరీ పోరు తప్పలేదు. నువ్వానేనా అన్నట్టు సాగిన తుదిపోరులో రెండో సీడ్ సబలెంకా 63, 36, 63 తేడాతో టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్)ను ఓడించింది. తొలి సెట్‌లో సబలెంకా సునాయాస విజయం సాధించింది. కానీ రెండో సెట్‌లో ఇగా ఆధిపత్యం చెలాయించింది. అలవోకగా సెట్‌ను దక్కించుకుంది. అయితే ఫైనల్ సెట్‌లో మాత్రం మళ్లీ సబలెంకా పుంజుకుంది. కళ్లు చెదిరే షాట్లతో ఇగాను హడలెత్తించిన సబలెంకా సునాయాస విజయంతో టైటిల్‌ను సొంతం చేసుకుంది.