Sunday, January 26, 2025

అస్సాంలో మాఫియా రాజ్యం: ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

ధుబ్రి(అస్సాం): అస్సాంలో మాఫియా రాజ్యం నడుస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అనేక కుంభకోణాలలో కూరుకుపోయారని ఆమె ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ధుబ్రిలో ఒక సభలో ఆమె ప్రసంగిస్తూ తెలంగాణలో అసదుద్దీన్ ఒవైసీతో బిజెపికి సంబంధాలు ఉన్న తరహాలోనే ఐఎయుడిఎఫ్‌కు చెందిన బద్రుద్దీన్ అజ్మల్‌తో బిశ్వ శర్మకు రహస్య ఒప్పందం ఉందని ఆమె తెలిపారు.

ఈ ఇద్దరు ముస్లిం నాయకుల లక్షం కాంగ్రెస్‌ను ఓడించడమేనని ఆమె అన్నారు. జెడిఎస్‌కు చెందిన కర్నాటక ఎంపి ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి తాజాగా వెలుగుచూసిన అశ్లీల వీడియోలను ప్రస్తావిస్తూ అలాంటి వ్యక్తి తరఫున బిజెపి ప్రచారం చేస్తోందని, అతను దేశం విడిచి పారిపోతుంటే బిజెపి ప్రభుత్వం అడ్డుకోలేదని ఆమె విమర్శించారు.

ఎన్నికల బాండ్ల వివాదంపై బిజెపిని తీవ్ర స్థాయిలో ఆమె విమర్శించారు. కేవలం 10 ఏళ్లలో ప్రపంచంలోనే అతి సంపన్న పార్టీగా బిజెపి మారిందని కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లు పాలించినా అంత సంపాదించలేకపోయిందని ఆమె విమర్శించారు. సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధాని నరేంద్ర మోడీకి పట్టడం లేదని, ఆయన తన అహంకార వైఖరితో సామాన్యుల సమస్యలను అర్థం చేసుకోవడం లేదని ప్రియాంక ఆరోపించారు. అస్సాంలో నిరుద్యోగిత అతి పెద్ద సమస్యగా మారిందని, ముఖ్యమంత్రికి, మంత్రులకు సొంత ప్రయోజనాలు తప్ప ప్రజల బాధలు పట్టడం లేదని ఆమె విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News