Saturday, February 22, 2025

మాయపొర

- Advertisement -
- Advertisement -

దేశాన్ని ఇప్పుడొక మాయపొర కమ్మేసింది
స్వేచ్ఛపట్ల విశ్వాసం లేని గుంపు
తెల్లోడికి ఊడిగం చేసిన గుంపు
దేశపు స్వాతంత్య్రంలో
పాలుపంచుకోని గుంపు
ఇప్పుడు అధికార పీఠంపై
విన్యాసాలు చేస్తోంది
వేషాలు అనేకం వేసేది మాత్రం వాడొక్కడే
ఏ గూటి పలుకులు అక్కడే పలుకుతూ
మంటల రాగాల్ని అంటించుకొంటూ
దుఃఖపు కోతలు కోసుకుంటూ వెళుతున్నాడు
అబద్ధాన్ని మఱ్ఱిచెట్టంత పెంచి
జనం గుండెల్లో ఊడలు దించుకుంటూ విస్తరించాలని చూస్తున్నాడు
నువ్వు నిజమై వెలుగుతుంటే
అమాంతం నిన్ను ఆర్పేసి
చీకట్లను విసురుకుంటూ వెళుతున్నాడు

దేశం స్వేచ్ఛ వాయువులు
పీల్చడం ఆరంభమైనవేళ
నవనిర్మాణం కోసం ఎన్నెన్ని సమావేశాలు
ఎన్నెన్ని చర్చలు ఎన్నెన్ని వాదోపవాదాలు
అన్నీ రేపటి పచ్చదనం కోసమే
మొదలైన నాటి కలలు
ఆకలిలేని అసమానతలు లేని
బతుకుల కోసమే

ఇప్పుడు వాడు తన రంగులు హంగులు
మందిరాలు వేషాలు ఉపవాసాలూ దీక్షలు
అన్నీ నీకోసమే అంటాడు
జనాన్ని శవాలుగా మార్చి
ఆ శవాలగుట్టల మీదుగా నడిచెల్లిపోతుంటాడు
మాటల మంత్రాలతో అద్భుతాలు వల్లెవేస్తుంటాడు
వాడు చాపకింద నీరై
అగరుబత్తి పొగమాటున కమ్ముకునే వాసనై
మనల్ని చుట్టుముట్టేస్తుంటాడు
రోడ్లమీద నాటుతున్న మేకుల సాక్షిగా
దేశం రేపటిలోకి నడిచిపోతోంది
నువ్వు ముక్కలై ఎగిరిపడుతుంటే
వాడి కళ్ళల్లో మతాబాలు వెలుగుతుంటాయి
దేశపు మహానగరంలో మొలుస్తున్న పీఠాలు
శాశ్వత పాదాక్రాంతమవ్వాలని
వాడి వ్యూహం
ఏ వ్యూహమూ లేని నువ్వు
కాషాయపు వలలో చిక్కుకొని
జీవితాన్ని అవసరాల కోసం క్యూ లైన్లలోనో
మందిరాల చుట్టూ ప్రదక్షిణల్లోనో గడిపేస్తుంటావు
ఎక్కడెక్కడి నుంచో రక్తం మాత్రం చిందుతూనే ఉంటుంది.
బండ్ల మాధవరావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News