రాజన్న సిరిసిల్లలో క్షుద్రపూజల కలకలం రేపాయి. కుసుమ రామయ్య పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఓ మేక పిల్లను బలివ్వడానికి సిబ్బంది యత్నించినట్లు సమాచారం. వేకువ జామున 5 గంటలకే రికార్డ్ అసిస్టెంట్ వెంకటేశం.. స్కూల్ గేటు తాళం తీసి ఉంచడం గమనించిన స్థానికులు.. లోనికి వెళ్లి పరిశీలించగా.. పాఠశాల ఆవరణలో క్షుద్ర పూజకు ఏర్పాట్లు చేసినట్లు గుర్తించారు. వెంటనే డీఈఓకి సమాచారం ఇచ్చారు. డీఈఓ ఆదేశాల మేరకు పాఠశాలకు వచ్చిన ఎంఈఓ రఘుపతి.. సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
స్కూల్ ఆవరణలో క్షుద్ర పూజలకు పాల్పడేందుకు ప్రయత్నించిన వారిపై పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే, పాఠశాలలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడంతో విద్యార్థులు, వారి పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. స్కూల్ సిబ్బందే మూఢనమ్మకాలను ప్రోత్సహించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.