రూ.790 కోట్ల చిట్‌ఫండ్ మోసం కేసు
కోల్‌కత: మదుపరులను రూ. 790 కోట్ల మేర మోసగించిన చిట్‌ఫండ్ కుంభకోణం కేసును దర్యాప్తుచేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులు శుక్రవారం ప్రముఖ ఇంద్రజాలికుడు పిసి సర్కార్(జూనియర్)ను తమ కార్యాలయానికిపిలిపించి ప్రశ్నించారు. శుక్రవారం మధ్యాహ్నం కోల్‌కతలోని సాల్ట్ లేక్‌లో ఇడి కార్యాలయానికి పిసి సర్కార్ చేరుకోగా వెంటనే ఈ కుంభకోణంలోఆయన పాత్రపై అధికారులు ప్రశ్నించడం ప్రారంభించారు.
పిన్‌కాన్ గ్రూపు, టవర్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలకు ఈ కుంభకోణంలో ప్రమేయమున్నట్లు ఇడి గుర్తించింది. చిట్‌ఫండ్‌కేసులో తాము పిసి సర్కార్‌ను ప్రశ్నిస్తున్నట్లు ఇడి అధికారి ఒకరు తెలిపారు. ఆయనకు ఈ కుంభకోణంతో సంబంధం ఉందో లేదో తాము కనుగొనాల్సి ఉందని ఆయన చెప్పారు. కొద్ది రోజుల క్రితం టవర్ గ్రూపునకు చెందిన ఒక సీనియర్ అధికారిని ఇడి అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించినపుడు సర్కార్ పేరు బయటకు వచ్చినట్లు ఆ అధికారి తెలిపారు. ఇదే కేసుకు సంబంధించి 2021లో పిసి సర్కార్‌కు చెందిన బల్లగుంజ్ నివాసంలో సిబిఐ సోదాలు జరిపింది.