Monday, December 23, 2024

తప్పుడు వాంగ్మూలం ఇచ్చిన మాగుంట రాఘవ : ఇడి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు చెందిన వైఎస్‌ఆర్‌సిపి ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) ఎదుట తప్పుడు వాంగ్మూలాన్ని ఇచ్చారని, అంతేగాక దర్యాప్తునకు ఆటంకం కలిగించేందుకు కీలక సాక్ష్యాన్ని నాశనం చేశారని తన చార్జిషీట్‌లో ఇడి పేర్కొంది. ఫిబ్రవరి 10న ఈ కేసుకు సంబంధించి మాగుంట రాఘవను ఇడి అరెస్టు చేసింది. ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఇడి రాఘవను నిందితుడిగా పేర్కొంటూ అనుబంధ చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేసింది.

ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(పిఎంఎల్‌ఎ) చట్టంలోని సెక్షన్ 50 కింద మాగుంట రాఘవ తప్పుడు వాంగ్మూలాన్ని ఇచ్చారని ఇడి పేర్కొంది. మాగుంట ఆగ్రో ఫార్మ్, పిక్సీ ఎంటర్‌ప్రైజెస్‌కు సంబంధించి ఆయన తప్పుడు వివరాలు ఇచ్చారని ఇడి తెలిపింది. రాఘవ తమకు కట్టుకథలు చెప్పినట్లు తమ దర్యాప్తులో తేలిందని చార్జిషీట్‌లో ఇడి తెలిపింది. రాఘవ నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, అయితే అందులోని డాటా అంతా డెలిట్ అయిపోయి ఉందని ఇడి పేర్కొంది. అత్యంత కీలకమైన సాక్ష్యాన్ని ఆయన నాశనం చేశాడని పేర్కొంది. దర్యాప్తునకు ఆటంకం కలిగించడమే ఆయన ప్రధాన ఉద్దేశంగా కనపడుతోందని తెలిపింది.

అనంతరం..ఈ కేసులో మరో నిందితుడు బుచ్చి బాబు ఫోన్ నుంచి రాఘవ జరిపిన సంభాషణలను సేకరించామని ఇడి తెలిపింది బుచ్చి బాబు ఫోన్‌లో మాగుంట రాఘవ చాట్స్ యథాతథంగా ఉన్నాయని, ఇవే సంభాషణలు రాఘవ ఫోన్‌లో లేకపోవడాన్ని బట్టి చూస్తే ఉద్దేశపూర్వకంగానే సాక్ష్యాలను నాశనం చేసినట్లు రుజువవుతోందని ఇడి పేర్కొంది. వారిద్దరి అక్రమాలను రుజువు చేయడానికి ఇదికి ఇవే కీలక ఆధారాలని ఇడి తెలిపింది. ఎక్సయిజ్ కుంభకోణం జరిగిన కాలం, ఆ తర్వాత మాగుంట రాఘవ తన మొబైల్ ఫోన్‌ను అనేక సార్లు మార్చారని, ముఖ్యంగా అత్యంత కీలక డాటా ఉన్న ఫోన్ మాత్రం ఆయన వద్ద లభించలేదని ఇడి తన చార్జిషీట్‌లో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News