హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవ సోమవారం ఇడి అధికారుల ముందు లొంగిపో యారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన మాగుంట రాఘవకు కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే బెయిల్ ను రెండు వారాల నుండి ఐదు రోజులకు కుదించారు. దీంతో సోమవారం మాగుంట రాఘవ ఇడి అధికారులకు లొంగిపోయారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన మాగుంట రాఘవకు ఈ నెల 7వ తేదీన ఢిల్లీ హైకోర్టు రెండు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. తన అమ్మమ్మకు అనారోగ్యంగా ఉందని మాగుంట రాఘవ బెయిల్ కోరాడు. ఆరు వారాలకు బదులుగా రెండు వారాల పాటు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.
మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టులో ఇడి ఈ నెల 8వ తేదీన సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై ఈ నెల 9వ తేదీన సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. మధ్యంతర బెయిల్ పై స్టే ఇవ్వాలని ఇడి కోరింది. బెయిల్ విషయమై మాగుంట రాఘవ అబద్దాలు చెప్పారని ఇడి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత రెండు వారాల పాటు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంకోర్టు ఐదు రోజులకు కుదించింది. ఈ నెల 12న లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. దీంతో సోమవారం ఇడి అధికారుల ఎదుట మాగుంట రాఘవ లొంగిపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన మాగుంట రాఘవను ఇడి అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవను అరెస్ట్ చేశారు. ఇదే కేసులో పలుమార్లు ఆయనను విచారించారు. అనంతరం రాఘవను ఇడి అరెస్ట్ చేసింది. ఒంగోలు పార్లమెంట్ స్థానం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న వైఎస్సార్సిపి ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడే మాగుంట రాఘవ.