అమితాబ్, అక్షయ్‌లకు ‘మహా’ కాంగ్రెస్ హెచ్చరిక
భండారా(మహారాష్ట్ర): ఇంధన ధరల పెరుగుదలపై బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ తమ వైఖరిని వెల్లడించకపోతే రాష్ట్రంలో వారి సినిమాల ప్రదర్శన, షూటింగ్‌లను అనుమతించబోమని మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు నానా పటోలె హెచ్చరించారు. గురువారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత యుపిఎ ప్రభుత్వ పాలనలో ఇంధన ధరల పెరుగుదలపై ట్వీట్లు చేసిన అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ ఇప్పుడు అదే అంశంపై మౌనంగా ఉంటున్నారని వ్యాఖ్యానించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పటోలె అన్నారు.
గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలంలో ఇంధన ధరలు పెరిగితే ట్వీట్ల ద్వారా విమర్శలు గుప్పించిన అమితాబ్, అక్షయ్ ఇప్పుడు పెదవి విప్పడం లేదని ఆయన దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత భారీగా పెరిగినా వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న ఈ అన్యాయంపై అమితాబ్, అక్షయ్ గళం విప్పకపోతే వారి సినిమాల ప్రదర్శనలను, షూటింగ్‌లను మహారాష్ట్రలో అనుమతించబోమని పటోలె హెచ్చరించారు. మన్మోహన్ హయాంలో చేసినట్లుగానే మోడీ ప్రభుత్వ జాతి వ్యతిరేక విధానాలపై వారిద్దరూ తమ నిరసనను తెలియచేయాలని ఆయన డిమాండు చేశారు. వాహనాలకు తీసుకొచ్చిన ఫాస్ట్‌ట్యాగ్ విధానంపై కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన దుయ్యబట్టారు.