Monday, December 23, 2024

దళిత ఆత్మగౌరవ పతాక

- Advertisement -
- Advertisement -

ఏ కులమంచు నన్ను వివరింపుల గూడిన కుంటి ప్రశ్నలన్ -/ వ్యాకుల పెట్టబోకుడది వ్యర్థము లోకపు మంచిచెడ్డలన్/ దూకియు మున్గకుండ నిటుదూరములన్ బడివచ్చినాడ ఈ/ యాకతి నేమికల్గు? హదయాకతి జూచి సమాదరించరే!/ అని ఆంధ్రపాఠకలోకానికి విన్నవించుకున్న బోయిభీమన్న 1911, సెప్టెంబర్ 19న తూర్పుగోదావరి జిల్లా కోనసీమకు చెందిన రాజోలు తాలుకా, మామిడి కుదురు గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు శ్రీమతి నాగరత్నమ్మ, శ్రీ పల్లయ్యగారు./ మహాకవి బోయిభీమన్నగారి ఈ పద్యం / ఈ పద్యం విన్నంతనే నవయుగకవి చక్రవర్తి గుర్రంజాషువాగారి “నా కవితావధుటి…పద్యమూ అందులోని మీదే కులమంచు ప్రశ్న వెలయించి”… అనే చురకత్తిలాంటి వాక్యాలు గుర్తుకొస్తాయి. జాషువాకంటే పదహారేళ్లు మాత్రమే చిన్నవాడైనా భీమన్న జాషువాను కవిత్వంలో గురువుగా భావించడం విశేషం. ఈ పద్యంలోని ‘దూరములబడివచ్చినాడ’ పదబంధంలోని దూరం కేవలం భౌతిక దూరంకాదు. శతాబ్దాల తరబడి కులవిపక్షతల, అణచివేతల మనో మాలిన్యాలను దాటివచ్చిన దూరం. మానసిక దూరం జాషువాలాగే భీమన్న తొలినాళ్లలో అవమానాలను ఎదుర్కొన్నా ఆ తర్వాత ఆంధ్రలోకం ఆయన్ను సమాదరించింది.

అందుకు నూరుకు చేరుకున్న ఆయన రచనలు, అందుకున్న సన్మానాలూ, సత్కారాలు, బిరుదులు తార్కాణం. అంతమాత్రాన ఆయన తను పుట్టి పెరిగిన జన్మభూమిని మర్చిపోలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా, జన్మభూమి మామిడికుదురు గ్రామం, కోనసీమ అందచందాలను గూర్చి ఆయన కవితలల్లారు. భీమన్న రాసిన పాలేరు, కూలిరాజు నాటకాలు ఆ రోజుల్లో ఆంధ్రదేశంలో పెద్ద సంచలనం. అప్పట్లో 25 వేల కాపీల ముద్రణలతో, లక్షప్రదర్శనలలో పాలేరు నాటకం ఆంధ్రదేశాన్ని ఒక ఊపువూపింది. చరిత్రను సష్టించింది. ఆ రోజుల్లో పాలేరు నాటకం ఆడని మాల మాదిగ వాడ లేదంటే అతిశయోక్తికాదు. ‘ఒక రచన సామాజిక జీవితంలో ఎంతటి పరివర్తనకు, విప్లవాత్మకమైన మార్పుకు దోహదం చేస్తుందో చేసి నిరూపించిన నాటకం పాలేరు. ఆ. రోజుల్లో పాలేరు నాటకం చూసి, పాలేరు తనాన్ని వొదిలి, ఊరినుండి ఇంటినుండి పారిపోయి ఎస్సీ హాస్టళ్లలో చేరి పెద్ద పెద్ద చదువులు చదివి ఉన్నతాధికారులు, (ఐఏఎన్)లు అయినవారు ఎందరో వున్నారు. ఆ నాటకం ప్రదర్శించిన ప్రతిచోటా అగ్రకుల భూస్వాములనుండి వ్యతిరేకతను దాడులనూ ఎదుర్కొన్న సందర్భాలు వున్నాయి. అందుకే ఆ భూస్వామ్యవ్యవస్థను ఇలా ప్రశ్నించారు. మాలను గావించి పాలేరుగా జేసి /కామందు కాలికి, గట్టినావు/ అంటరాదనిచెప్పి పెంటల పాల్జేసి /నీచులమను పేర నిల్చినావు/చదువు సంధ్యలు లేక జంతువులనుబోలె/ఊరివెల్పల చావనుంచినావు /

యజ్ఞానతిమిరాల యడుగున బడద్రోసి /బరువుగా యెదనొక్కి పట్టినావు అని కులం పేరుతో మాలలను వెట్టిబానిసలుగా మార్చివేసిన వ్యవస్థను నిరసించాడు. ఈ అవ్యవస్థకు అవిద్యేకారణమని గుర్తించాడు. డా॥ బి.ఆర్. అంబేడ్కర్ ప్రబోధించిన బోధించు, పోరాడు, సమీకరించు అనే సిద్ధాంతాన్ని మనసులో వుంచుకున్నాడు. కనుకనే “గోచి పెట్టుట నేర్చుకొనగానే / బిడ్డచేతికి కర్రిచ్చు రైతులారా!/ విద్య, యనెడు కాగడా వెలుగు చూపి / ఏల రక్షించుకొనరు మీబాలకులను” అని అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలడానికి చదువు దీపాన్ని మించిన ఆయుధంలేదని ప్రకటించాడు. కూడు గూడు గుడ్డ కొంపయు సమానముగ కూర్పుము రా లోకమున అనీ, ప్రభువు సేవకుడు లేని సంఘమును పదిలముగా నిర్మింపుము అనీ ఆర్థిక, సామాజిక సమానత్వాన్ని పాలేరు నాటకం ద్వారా ప్రభోదించాడు. నిరుపేద కూలీల అభ్యుదయాన్ని కాంక్షిస్తు రాసిన నాటకం ‘కూలిరాజు’ ఆ శీర్షికలోనే నాటకం ఇచ్చే సందేశాన్ని యిమిడ్చారు. “వందలకొద్దీ ఎకరాల కోటేశ్వరునికి చెందుట తగదోయ్! దేశంలో గల సర్వ భూమిని జాతీయం చేయండోయ్‌” అనే స్ఫూర్తితో కూలిరాజు నాటకం సాగుతుంది. అరకలు దున్నే అన్నల్లారా! ఊడ్పులు ఊడ్చేవదినల్లారా సంపదకంతా కర్తలు మీరూ! స్వరాజ్యానికి రాజులు మీరే” శ్రామిక రాజ్యంలో కూలీయే రాజు అని ప్రకటిస్తాడు. పాలేరు నాటకం ద్వారా సామాజిక సమానత్వాన్ని,

కూలిరాజు నాటకంలో ఆర్థిక స్వావలంబనను కూడా ప్రతిపాదించాడు. ఇలా తొలినాటి దళిత సాహిత్యంలోనే భీమన్న ఆర్థికకోణాన్ని చూపడం రచయితగా అతని దూరదష్టికి నిదర్శనం. వీటితోపాటు రాగవాశిష్టం, అసూయ, బాలయోగి, ఆదికవి వాల్మీకి, వేదవ్యాసము, ధర్మవ్యాధుడు వంటి నాటకాలను రచించారు. రాగవాశిష్ట నాటకంలో హరిజనులు ఆర్యులే అన్న సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. గేయ రచనలతో పాటు వచన కవితాన్ని కూడా విరివిగా రాసాడు భీమన్న. గుడిసెలు కాలిపోతున్నాయ్ వచనకవితా సంపుటి 1973లో ప్రచురించారు. 1976లో ఈ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమివారి అవార్డు వచ్చింది. 57 ఖండికలు ఉన్న ఈ కవితాసంపుటిలో సాధారణంగా కవులదష్టి ప్రసరించని గుడిసెలు మాత్రమేకాదు, అవి పేదరికానికీ, కులవివక్షతకూ, అజ్ఞానానికి ప్రతీకలు. కావ్యం ముందుమాటలో ఇప్పుడు కూలిపోతున్నవి వట్టిగుడిసెలే కాదు. ఆ గుడిసెల్లోని గొర్రెల అజ్ఞానమూ, అబలత్వమూ, చీకటి, మురికి కూడా కాలిపోతున్నాయి” అని వివరించడం వల్ల పాఠకుడికి తత్వం త్వరగా అందుతుంది.

గుడిసెలు కాలిపోతున్నై /ఎవరిగుడిసెలో పాపం/మాల మాదిగలవే అయివుంటై /గుడిసెలు ఎవరి కుంటై/ఒకసారి కాలిపోయిన గుడిసెలు/మళ్లీమళ్లీ కాలిపోవడానికి/ఎక్కడినుంచి వస్తుంటై/అదే మన ధర్మంలోని రహస్యం” అయితే ఈ ధర్మంలోని అధర్మం ఎంతకాలం కొనసాగుతుంది అని ప్రశ్నించి తానే యిలా సమాధానం చెబుతున్నాడు. ఈ విషవలయం/సాగడం ఎంతవరకు/ రహస్యం గుడిసెలవాళ్లకు తెలిసేవరకు అని ఖండికను ముగిస్తారు. కర్మ సిద్దాంతం ముసుగులో దళితుల్ని యిక ఎంతోకాలం మభ్య పెట్టేవారు ఆ కుట్రను దళితులు పసిగట్టి భగ్నం చేసే రోజులు దగ్గరలోనే వున్నాయని ధ్వని పూరితంగా సూచిస్తాడు. ఇంకా అనాదికొననుండి అనంతతత్వంలోకి, శివాలకలు వంటి వచన కవితా సంపుటాలు వెలువరించారు. ఆధునికమైన వస్తువును స్వీకరించి ఎక్కడా సంభాషణలు లేకుండా పూర్తిగా గేయాలలోనే ఈ నాటకాలు సాగుతాయి. ఈ రకమైన రచనా ప్రయోగానికి భీమన్న అద్యుడు. బ్రాహ్మడేకాదు భువినంటరానితనము/అమలుపరచెడి ప్రతివాడు నంటరాని/ జనుడుగా పుట్టి తత్ఫలమనుభవించు/ చెరకు పండునె తుంగముస్తెలనునాట? అని ప్రశ్నిస్తాడు. దీపసభ కావ్యంలో లోకంలోని అనేక దీపాలను ముఖ్యంగా గ్రామీణ జీవితంలో నిత్యం వాడుకలో వుండేటటువంటి వాటిని

వర్ణించడం ఇంతవరకూ తెలుగులో లేదు. ఇది ఒక రకంగా కొత్త వస్తువు. కొత్త ప్రయోగం. భీమన్నగారు రాసిన పిల్లీశతకం కూడా విలక్షణమైన రచన. హిందూ సంప్రదాయంలో పిల్లి అశుభాన్ని కలుగజేసె జంతువు. పిల్లి ఎదురురావటాన్ని దుశ్శకునముగా భావిస్తారు. హేతువాద దష్టిగల భీమన్న అందమైనకందాలలో పిల్లీ శతకాన్ని రచించారు. పిల్లి చంకను బెట్టుక/వెళ్లుటయను పిచ్చినాడులు విశ్వాసములన్ /చెల్లవిక, నినుగైకొని/ఢిల్లీవరకేగవచ్చు తెలియవే పిల్లీ! /అని అనడమేగాక/ఎలుకపై పిల్లి, పిల్లిపై/ఎలుకను ఎక్కించుచెపుడు ఈ మనుషులు /మీ కులవైరమారనివ్వరు/కలహానులమ్మమ్మ! నరులు! కనవేపిల్లీ అని మనుషులు కులవైరాల్ని ఎగదోస్తు వుంటారు. ఇది కేవలం ఎలుక పిల్లులకే కాదు ప్రస్తుతం ఉపకులాల మధ్య ఆజ్యంపోసేంతవరకూ వచ్చింది వర్తమాన పరిస్థితి. 1970లో బాపురెడ్డి పద్యకావ్యాలు గ్రంథానికి రాసిన పీఠికలో శ్రీశ్రీపుట్టి సాహిత్యాన్ని, ఘంటసాల పుట్టి సంగీతాన్ని నాశనం చేసారని నా ఉద్దేశం” అని ప్రకటించిన ధైర్యశీలి భీమన్న. దాదాపు మూడు దశాబ్దాలకు పూర్వమే దళిత సమాజానికి, సమస్యకు మేనిఫెస్టో అనదగిన ధర్మంకోసం పోరాటం గ్రంథాన్ని రచించారు. “లక్షమంది మార్క్స్‌ల సిద్ధాంతం కంటే ఒక మహాత్ముడి రాజనీతి బలమైనది.

లక్షమంది మహాత్ముల కంటే ఒక్క అంబేడ్కర్ మానవ సమతాధర్మం బలమైనది” అని అంబేడ్కర్ ప్రతిపాదించిన మానవ సమతాధర్మ సిద్ధాంతం యొక్క అవసరాన్ని ఆనాడే గుర్తించాడు భీమన్న. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడ కుండా దళితులు స్వీయ ఉద్దరణకు తమనితాము. సంసిద్ధం చేసుకోవాలని ఈ గ్రంథం ఉద్భోదిస్తుంది. ప్రతీ దళితుడు తప్పక చదవాల్సిన గ్రంథం ధర్మం కోసం పోరాటం. ‘ధర్మకోసం పోరాటం’ గ్రంథాన్ని డా॥ బి.ఆర్. అంబేడ్కరుకు అంకితమిస్తూ భీమన్న రాసిన, ‘జయజయ అంబేడ్కరా’ గీతం దళిత జనగణమన గీతంగా ప్రసిద్ధి కెక్కింది. ప్రతి అంబేద్కర్ సభకు ఈ గీతం ప్రార్థన గీతం అయిపోయింది. 1944లో ఆంధ్రదేశ పర్యటనకు వచ్చిన అంబేడ్కర్‌ను రామచంద్రాపురం సభలో చూసిన భీమన్న ఆయన స్పురద్రూపానికి, వ్యక్తిత్వానికి ముగ్దుడయి, అప్పటికప్పుడు ఆంగ్లంలో అంబేడ్కర్ పేరు మీద పద్యాలు రాసి, మర్నాడు కాకినాడ పిఠాపురం మహారాజవారి కాలేజి ఆవరణలో జరిగిన అంబేడ్కర్ సన్మాన కార్యక్రమంలో ఆయన సమక్షంలో చదివి వినిపించారు. ఆ పద్యాలు తర్వాత కలకత్తా నుండి వెలువడే పీపుల్స్ హైరాల్స్ ఆంగ్ల పత్రికలో సంపాదకీయంగా ప్రచురించబడ్డాయంటే వాటి గొప్పతనం గ్రహించవచ్చు. అప్పటినుండి అంబేడ్కర్ ఆరాధన,

అధ్యయనం వారికి ఎక్కువైంది. పద్య ప్రక్రియలో రాసిన ‘అంబేడ్కర్ సుప్రభాతం’ పాటలలో కూర్చిన ‘పాటలలో అంబేడ్కర్’ సిద్ధాంతంగా రూపొందించిన ‘అంబేద్కర్ మతం’ గ్రంథాలు. భీమన్న ఎంతటి అంబేడ్కరిస్టో అద్దంపడతాయి. ఈ రచనలతోనే భీమన్న అంబేడ్కర్ ఆస్థాన కవిగా మారిపోయాడు. డా॥ బి.ఆర్. అంబేడ్కర్ రచించిన ఇన్విహిలేషన్ అఫ్ కాస్ట్ గ్రంథాన్ని తెలుగులో కుల నిర్మూలన పేరుతో అనువదించాడు. దీనికోసం కేంద్రరాష్ర్ట ప్రభుత్వాల నుండి, అనేక స్వచ్ఛంద సాహితి సంస్థల నుండి ఎన్నో గౌరవ ప్రశంసలను అందుకున్నాడు. 1971లో ఆంధ్రకళాపరిషత్తు, విశాఖపట్నం వారు కళాప్రపూర్ణ ప్రదానం చేసారు. 1973లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి విశిష్ట సభ్యత్వం యిచ్చి సత్కరించింది. ఆ సంవత్సరమే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదును ప్రదానం చేసింది. 2004లో పద్మభూషణ్‌తో సత్కరించింది. వారణాశిలోని కాశీ విద్యాపీఠ్, 1976లో డిలిట్ ప్రదానం చేసింది. 1978లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధాన పరిషత్ సభ్యులుగా నియమించింది. తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి రాష్ర్ట పురస్కారం భీమన్న గారికి ప్రధానం చేసింది. రాష్ర్ట ప్రభుత్వం తెలుగు ఆత్మగౌరవ పురస్కారం, హంస అవార్డు, జాషువా ఫౌండేషన్, జాషువా పురస్కారం, రామినేని.

పురస్కారం వంటి లెక్కకు మిక్కిలి పురస్కారాలు ఆయన అందుకున్నారు. కొనవూపిరి వున్నంతకాలం రచనలు చేసిన భీమన్న చివరిరోజుల్లో శ్రీశ్రీ కమ్యూనిస్టు కాడు, నే నెరిగిన జాషువా వంటి విశిష్ట రచనలు చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన మరణాంతరం తెలుగు విశ్వవిద్యాలయంలో భీమన్న సాహిత్య పీఠాన్ని నెలకొల్పింది. జీవితంలో స్వతంత్రంగా జీవించిన భీమన్న సాహితీ సజనలోనూ స్వతంత్రతను అభిమానించాడు. అనేక సందర్భాల్లో ఆయన వెలువరించిన అభిప్రాయాలు ముక్కు సూటిగా వుండటమేకాకుండా వివాదస్పదం కూడా అయ్యాయి. తన రచనల ద్వారా దళితుల ఆత్మగౌరవ పతాకను ఎగరవేసిన భీమన్న తను ఎవరో ఏమిటో చెప్పుకోడానికి ఎప్పుడు సంకోచించలేదు.“మాలను నేను విక్రమ కుమారుని నేను స్వతంత్ర విప్లవజ్వాలనునేను” అని చెప్పుకున్న భీమన్న తెలుగు సాహిత్యంలో స్వతంత్ర విప్లవ జ్వాలగా వెలుగొందాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News