Wednesday, February 12, 2025

మాఘ పూర్ణిమ వేళ పోటెత్తిన యాత్రికులు

- Advertisement -
- Advertisement -

ప్రయాగ్‌రాజ్ : ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్‌లో ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా కన్నుల పండువగా కొనసాగుతోంది. దేశ విదేశాల నుంచి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. కుంభమేళాలో మరో పుణ్య ఘట్టమైన మాఘ పూర్ణిమ వేళ బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకే త్రివేణీ సంగమం, ఇతర ఘాట్‌ల వద్ద దాదాపు 1.60 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్టు కుంభ్‌మేళా డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. ఈ మాఘ పూర్ణిమ స్నానంతో తమ నెలరోజుల కల్పవాసీ దీక్ష ముగించుకొని దాదాపు 10 లక్షల మంది మహా కుంభమేళా నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు.

దీంతో వారంతా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని , పార్కింగ్ స్థలాలను మాత్రమే వినియోగించాలని అధికారులు కల్పవాసీలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు భక్తులపై హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిపించారు. లఖ్‌నవూ లోని తన అధికారిక నివాసం నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వార్‌రూమ్‌లో సీఎంతోపాటు డీజీపీ ప్రశాంత్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ ప్రసాద్, సీఎం కార్యాలయం అధికారులు ఉన్నారు. మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే తన సతీమణితో కలిసి త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ప్రయాగ్‌రాజ్‌కు మంగళవారమే వారు చేరుకున్నారు. సాధారణ యాత్రికుడిగా పడవపై సంగమం వద్దకు చేరుకొని పూజలు నిర్వహించారు. మరోవైపు ఫిబ్రవరి 11 వరకు మొత్తం 46.25 కోట్ల మంది భక్తులు మహా కుంభ్‌కు విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరించినట్టు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News