ప్రయాగ్‌రాజ్: మహా కుంభమేళా అధికారికంగా ముగిసినప్పటికీ భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారని, కనుక కొన్ని ఏర్పాట్లను ఏడాది పొడవునా కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన కల్నల్‌గంజ్ నివాసి నీరజ్ కేసరివనీ ‘మహాకుంభమేళాకు పెద్ద ఎత్తున జనం రావడం వల్ల మేము ఇదివరలో దర్శించుకోలేకపోయాము. అయితే ఇప్పుడు వచ్చాము. ఆహ్లాదకరమైన సాయంత్రం, లెడ్ లైట్ల కాంతిలో సంగం ప్రాంతం నయనానందకరంగా ఉంది. ఇప్పటికీ మేళా కొనసాగుతుందన్నట్లుగా ఉంది’ అని వివరించాడు. మహాకుంభమేళాకు పెద్ద ఎత్తున భక్త జనకోటి రావడం వల్ల చాలా మంది కుంభమేళాను సందర్శించలేకపోయారు. ఈ విషయాన్ని ఢిల్లీకి చెందిన డాక్టర్ దీక్ష పేర్కొంటూ ‘జనం విపరీతంగా వస్తున్నారని తెలిసి మేము ఇదివరకు రావడంలో కాస్త వెనుకాడాము, ఇప్పుడు సంగంలో పుణ్యస్నానం ఆచరించి పుణ్యం సంపాదించుకున్నాను.
అయితే మాకు నిరాశ కలిగించిన విషయం ఏమిటంటే నాగ సాధువులను చూడలేకపోయామన్నది’ అని వివరించారు. పిటిఐ వార్తా సంస్థ విలేకరి మహాకుంభమేళా ప్రాంతం వెళ్లి చూశారు. అక్కడ అనేక మంది కార్మికులు త్రివేణి సంగం, అరైల్ ఘాట్, ఝూన్సీ వద్ద ఉన్న తాత్కాలిక కట్టడాలను కూల్చివేయడం గమనించారు. ఇదిలావుండగా మేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ అనేక మౌలిక వసతులు ఏడాది పొడవునా ఉండగలవని వివరించారు. వాటిలో లెడ్ లైట్లు, దుస్తులు మార్చుకునే గదులు, ఘాట్ల నిర్వహన వంటివి ఉన్నాయి. కాగా 3600 ‘పాంటూన్ వంతెనలు’ మాఘ మేళా వరకు అలాగే కొనసాగిస్తామని వివరించారు. 4000 హెక్టార్ల మేర మహాకుంభమేళా ప్రాంతమంతా విద్యుత్తు సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందని కూడా ఆయన తెలిపారు. కుంభమేళాకు రైల్వే శాఖ 16000 ప్రత్యేక రైళ్లు నడిపింది. ఉత్తర్‌ప్రదేశ్ రోడ్‌వేస్ 8850 బస్సులను నడిపింది. కుంభమేళాలో అనేక వసతులు కల్పించడానికి వివిధ రంగాల శ్రామికులు విశేషంగా కృషి చేశారు.