శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్లో ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం ‘మహా సముద్రం’. ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దసరా కానుకగా ఈనెల 14న రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ “ఇది ఒక భావోద్వేగాల ప్రేమ కథ. ఒకరి జీవితం మరొకరు జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించింది అనేది ఇందులోని ప్రధానాంశం. ‘మహా సముద్రం’లో ప్రతి ఒక్క ఎమోషన్ ఉంటుంది.
ఈనెల 14న తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ చూడబోతోంది”అని అన్నారు. హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ “సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. శర్వా వచ్చిన తరువాతే ఈ సినిమా స్థాయి పెరిగింది. హీరోయిన్స్‌తో పాటు జగపతి బాబు, రావు రమేష్ వంటి నటులు సినిమాలో అద్భుతంగా నటించారు”అని తెలిపారు. హీరో శర్వానంద్ మాట్లాడుతూ “9 మందితో కొనసాగే ఈ కథ చాలా బావుంటుంది. దర్శకుడు అజయ్ భూపతి చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఈ సినిమా ఎక్కువగా మహా పాత్ర చుట్టే ఉంటుంది. అలాంటి పాత్ర చేయడం చాలా కష్టం. అదితి చాలా బాగా చేసింది. అను కూడా చాలా బాగా నటించింది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అనిల్ సుంకర, హీరోయిన్లు అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్, రావు రామేష్, చేతన్ ప్రసాద్, రాజ్ తోటా తదితరులు పాల్గొన్నారు.