Monday, November 18, 2024

శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / అమరావతి : ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల లడ్డూపై వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ ప్రభుత్వం దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని టీటీడీ ఈవోను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఆయన శనివారం సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబును కలిసి నివేదిక అందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అంశంపై రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు స్పందిస్తున్నాయి. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం స్పందించిన సీఎం చంద్రబాబు దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవో శ్యామలరావును ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులతో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. తిరుమల దేవస్థాన పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. తిరుమల ఆలయశుద్ధి, సంప్రోక్షణ చేపట్టాలని నిర్ణయం తీసుకోనున్నారు. ధార్మిక పరిషత్ పెద్దల సూచనల మేరకు ముందుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు కల్తీ నెయ్యి వ్యవహారంపై దేవాదాయశాఖ కూడా అప్రమత్తమైంది.

శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగం : శ్రీవారి లడ్డూ కల్తీ దుమారం కొనసాగుతోన్న వేళ తిరుమల పవిత్రతను కాపాడే అంశంపై అత్యవసరంగా సమావేశమైన టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి లోని టిటిడి పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో శ్యామల రావు భేటీ అయ్యారు. లడ్డూ అపవిత్రత నేపథ్యంలో సంప్రోక్షణపై ప్రధాన అర్చకుడు, ఆగమ పండితులతో ఈవో చర్చించారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

తిరుమల లడ్డూకు మళ్లీ నందిని సువాసన : పవిత్రమైన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై లడ్డూ తయారీలో నందిని నెయ్యినే వినియోగించాలని నిర్ణియించారు. కిలో నెయ్యి రూ.478గా ధర నిర్ణయించారు. గత 20 ఏళ్లుగా నెయ్యి సరఫరా చేస్తున్న నందిని సంస్థ 2022- 23లో ధరల సమస్యతో తిరుపతికి నెయ్యి సరఫరా నిలిపివేసింది. తాజాగా టీటీడీ నందిని సంస్థకు నెయ్యి సరఫరా చేయాలని సప్లై ఆర్డర్ ఇచ్చింది. ఫలితంగా తిరుమల లడ్డూలో నందిని నెయ్యి సువాసన రానుంది.

తిరుమల లడ్డూ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు : తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ ఘటన నేపథ్యంలో తిరుపతి జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తిరుమల పవిత్రతను, ప్రసాదాన్ని వైఎస్సార్సీపీ నేతలు అపవిత్రం చేశారని కిరణ్ రాయల్ మండిపడ్డారు. ఇందులో భాగంగా జగన్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేశారని మండిపడ్డారు. ఆలయాన్ని, పోటును సంప్రోక్షణ చేయాలని తెలిపారు. కల్తీ నెయ్యి కొనుగోళ్ల వ్యవహారంలో మాజీ ఈవో ధర్మారెడ్డి కీలకమని చెప్పారు. ఈ వ్యవహారంలో మాజీ ఛైర్మన్, టీటీడీ ఉన్నతాధికారులను అరెస్ట్ చేయాలని ఆయన కోరారు.

భక్తుల సెంటిమెంట్ కు అంత్యంత ప్రాధాన్యత ఇస్తాం: – సిఎం చంద్రబాబు నాయుడు

దేవాలయాల పవిత్ర, భక్తుల సెంటిమెంట్ ను కాపాడేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి మతానికి కొన్ని సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఉంటాయని, ప్రభుత్వం వాటి కాపాడాల్సిన అవసరం ఉంటుందని సిఎం అన్నారు. ప్రజల మనోభావాలు అంటే లెక్కలేకుండా గత ప్రభుత్వం వ్యవహరించిందని, శ్రీవారి లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో రివర్స్ టెండర్లు ఏంటని ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సందర్శకుల నుంచి వినతులు తీసుకునేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులతో కొద్ది సేపు ముచ్చటించారు. తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై తన అభిప్రాయాలు, తీసుకునే చర్యలు వివరించారు. సిఎం చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో దేవాలయాల్లో అనేక అపచారాలు జరిగాయన్నారు. వైసీపీ నాయకులు నేరాలు చేసి ఎదురుదాడి, బుకాయింపు, ఫేక్ ప్రచారం అనే సిద్ధాంతంతో పనిచేస్తున్నారు తప్ప బాధ్యత అనేది లేదన్నారు. అందుకే వీళ్లను కొలంబియా నేరస్తుడు, మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్ తో పోల్చానని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News