Saturday, November 16, 2024

కోటి వరాలిచ్చే వేములవాడ రాజన్న

- Advertisement -
- Advertisement -

Maha shivaratri essay in telugu

 

మన తెలంగాణ / వేములవాడ: కోడెను కట్టి రాజన్న అని మొక్కితే నేనున్నా…. అంటూ కోటి వరాలిచ్చే ఎములాడ రాజన్న కొలువైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. లెంబాలవాటికగా, ఏమిలేనివాడగా, ఎములాడగా పిలువబడుతూ క్రమేణా వేములవాడగా మారి ప్రసిద్ద ఆధ్యాత్మిక పట్టణంగా ఈ క్షేత్రం విరాజిల్లుతుంది. పట్టణం నడిబొడ్డున ఆలయాలతో నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉంటుంది. దక్షిణ కాశీగా పేరుగాంచి, దక్షిన భారత దేశంలో ప్రసిద్ద శైవక్షేత్రంగా పేరొందింది. ఈ క్షేత్రంలో అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించుకునే వేడుకే మహాశివరాత్రి. ఈ మహా జాతరను నేటి నుండి 3 రోజుల పాటు నిర్వహించేందుకు ఆలయంలో రాష్ట ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా రాజన్న ఆలయ స్థలపురాణం, ఆలయ విశిష్టత పట్టణంలో ఆలయాలు, పూజల వివరాలపై ప్రత్యేక కథనం..
శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. అందుకే ఆ రోజున ప్రత్యేక భక్తిశ్రద్దలతో ప్రజలు పరామత్ముడిని కొలుస్తారు. శివనామస్మరణతో రోజంతా గడుపుతూ రాత్రి జాగారం చేస్తారు. తనలోని శక్తిని జాగృతం చేస్తు భోళా శంకరుడిని ప్రసన్నం చేసుకునేదే జాగారం. రాజన్న అని నోరారా పిలుచుకునే రాజరాజేశ్వర స్వామి ఎంతో మహిమ గల దేవుడని భక్తుల విశ్వాసం. వేములవాడలో పరమశివుడు రాజరాజేశ్వర స్వామి పేరుతో కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో శివుడు పార్వతీ రాజరాజేశ్వరదేవి సమేతుడై లింగరూపంలో వెలిశాడు. వందల సంవత్సరాల చరిత్ర గల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందినది.
స్థల పురాణం…
వేములవాడ రాజన్న సన్నిధికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ఉంది. వృత్రాసురిని చంపిన ఇంద్రుడు బ్రహ్మ హత్యాదోషం నివారించుకోవడానికి ఎన్నో పుణ్యక్షేత్రాలకు తిరిగాడు. అయితే ఎక్కడకు వెళ్లినా కూడా దోష నివారణ జరగలేదట. చివరకు బృహస్పతి సూచనతో వేములవాడలోని రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నాడట. ఇక్కడకు రావడంతోనే ఇంద్రుడికి దోష నివారణ లభించిందని పెద్దలు చెబుతుంటారు. భాస్కర, హరిహర క్షేత్రంగా పిలువబడుతున్న ఆలయం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో చెప్పబడింది. అర్జునుడి మునిమనుమడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపడం వల్ల కలిగిన బ్రహ్మహాత్యాపాతకాన్ని వదిలించుకోవడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట. ఆ శివలింగాన్ని ప్రతిష్టించేందుకు సిద్దమైన నరేంద్రుడు మొదటి జాములో నిద్ర నుండి లేవకపోవడంతో పక్కనే ఉన్న నాంపెల్లి గుట్ట నుండి నవనాథ సిద్ధులు ఈ శివలింగాన్ని ప్రతిష్టించారని ఇప్పటికి మొదటి జాములో వారు ధర్మగుండం ద్వారా నేరుగా వచ్చి మూల విరాట్టుకు పూజ చేసి వెళ్తారని భక్తుల నమ్మకం. తాను ప్రతిష్టించాలనుకున్న లింగాన్ని ఎవరో ప్రతిష్టించడం చూసి బాధపడుతున్న నరేంద్రుని చూసి ప్రత్యక్షమై మరో శివలింగాన్ని ఇచ్చి బాల రాజేశ్వరస్వామి రూపంలో ప్రతిష్టింపజేశారని, ఆయనకు బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తి కలిగించాడని పురాణ గాధ ఉంది. అందుకే శివుడు విశ్రాంతి కోసం ఎవరికి చెప్పకుండా కైలాసం నుండి వేములవాడకు వచ్చాడని, ఆయన వెంటే నంది వేములవాడకు రావడంతో వృషభుని భక్తికి మెచ్చిన శివుడు రాజన్న ఆలయంలో తనకు కోడె మొక్కులు చెల్లించి తనతో సమానంగా చూస్తారని వరమిచ్చినట్లుగా స్థానికంగా కథనం ప్రచారంలో ఉంది.
ధర్మగుండం మహత్యం…
ధర్మగుండంలో స్నానం ఆచరించి కోడెలను కట్టి తమ తమ కోరికలు చెప్పుకుని ఇక్కడికి వచ్చే భక్తులు మొదట ధర్మగుండలో స్నానం ఆచరించి కోడెలను కట్టి తమ తమ కోరికలు చెప్పుకుని ఒకరోజు రాత్రి నిద్ర చేస్తే వారి కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ధర్మగుండం వెనుక ఒక కథ ఉంది. రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తి తనకు వచ్చిన కుష్టు వ్యాధి నివారణకు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ చివరకు వేములవాడ ప్రాంతాన్ని చేరుకుని ఇక్కడ నెలకొని ఉన్న దక్షిణామూర్తి ప్రాంతంలో ఒక మహా బోధి వృక్షం ఉండేది. దాని పక్కనే ఒక కోనేరు ఉంది. ఇక్కడ బస చేయడానికి అనువైన ప్రదేశంగా ఉండడం వల్ల బోధి చెట్టు కింద సేద తీర్చుకున్నాడు. తర్వాత మరుసటి రోజు ఉదయం స్నానమాచరించుటకు పక్కనే ఉన్న కోనేరులో దిగగానే ఒక్కసారిగా తన శరీరాన్ని ఎదో బలమైన శక్తి కోనేరు అడుగునకు లాగినట్లు అనిపించింది. అంతే చక్రవర్తి కోనేరు అడుగు భాగం నుండి కొంత సమయంలో సంపూర్ణ ఆరోగ్యంతో తన వ్యాధి నయం అయి బయటకు వచ్చాడు. అంతే ఆ రోజు బోధి వృక్షం కింద గల దక్షిణామూర్తి(శివలింగం)కి పూజనాచరించి నమ్మలేని నిజాన్ని చూసి నివ్వెరపోతూ ఏమి ఆ కోనేటి మహత్యం అంటూ ఆలోచిస్తు చెట్టు కింద వాలిపోయాడు. కొద్ది సేపటి తరువాత జనం అలజడికి మేల్కోని చూడగా అక్కడ ఒక మహాముని కూర్చుండి, వ్యాధిగ్రస్తులైన వారికి కోనేటి నీటితో వైద్యం చేస్తు కనిపించాడు. ఆ మహా మునినికి ప్రణమిల్లి అయ్యా నేను రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తిని నాకు అతి భయంకరమైన కుష్టు వ్యాధి వ్యాపించినది. ఎన్నో ప్రదేశాలు తిరిగా ఎన్నో పుణ్యనదులలో స్నానమాచరించా కానీ ఈ కోనేటిలో మునగగానే నా వ్యాధి దూరమైంది. ఎలా ? అని నా సందేహన్ని నివృత్తి చేయండి అంటూ ప్రాధేయ పడ్డాడు. అప్పుడు ఆ మహాముని ఈ విధంగా చెప్పాడు. ఈ కోనేటి అడుగు భాగమున అష్టదిక్కుల కాలభైరవ జ్వాలాముఖి, బహుముఖి దేవతలు కొలువుతీరి ఉన్నారు. అందుకే ఈ కోనేటికి కలియుగాంతం వరకు మహిమ అలానే ఉంటుందని చెప్పాడు.
ఆలయాల పరంపర….
పేరుకే శివాలయమైన శైవంతో పాటు వైష్ణవ పూజలకు అంతే స్థానం ఉంది. రాజన్న ఆలయంలో క్షేత్ర పాలకుడిగా అనంత పద్మనాభస్వామి ఉండడం, శ్రీ సీతారామచంద్ర మూర్తి స్వామి వారి ఆలయం ఉండడంతో వైష్ణవ పూజలు కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి. శ్రీ రామకళ్యాణం ఘనంగా జరుగుతుంది. మహాశివరాత్రి తరువాత పెద్ద పండుగ శ్రీ రామనవమే. శైవులు, వైష్ణవులు, జైనులు, ముస్లిం మతస్థులతో పాటు అన్ని వర్గాల వారు కొలిచే క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఆలయంలో ప్రతినిత్యం అభిషేకాలు, శివకళ్యాణాలు, బాలా త్రిపురా సుందరి మాతకు కుంకుమార్చనలు, మహాపూజ, పెద్ద సేవ తదితర పూజలతో భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. రాజన్న గర్భగుడిలో మూలవిరాట్టు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఎడుమ వైపున శ్రీ లక్ష్మిగణపతి, కుడివైపునా పార్వతీ దేవి ఉంటుంది. గర్భగుడికి ఎదురుగా ముస్లిం దర్గా ఉండడంతో పెద్ద ఎత్తున ముస్లిం, హిందువులు దర్గాతో పాటు ఆలయంలో పూజించడం ఇక్కడ ప్రత్యేకత. మ్యూజియంగా గండాలు తొలగడానికి భక్తులు గండ దీపంలో నూనె పోయడం ఇక్కడి ప్రత్యేకత.
ప్రత్యేక పూజలు…
శివరాత్రి రోజున స్థానిక అర్చకులచే మహాలింగార్చన జరుగుతుంది. అప్పుడు దేవాలయాన్ని మూడు లక్షలకు పైగా భక్తులు సేవించుకుంటారు. అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్థరాత్రి వేళ శివునికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. ఈ దఫా వేములవాడకు ఐదుగురు మంత్రులు ఈ పూజలకు హజరు కానుండగాత స్వామి వారికి టిటిడి పట్టువస్త్రాలు అందజేస్తుంది.
వేములవాడకు ఎలా వెళ్లాలి…
వేములవాడలో ఎటువంటి విమానాశ్రయం, రైల్వే స్టేషన్ లేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక హెలికాప్టర్ సేవలు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ఇటీవలే రైల్ మార్గం నిర్మాణం అవుతుంది. హైదరాబాద్, వరంగల్ నుండి ప్రతిరోజు అరగంటకొక బస్సు చొప్పున ఈ క్షేత్రానికి వస్తుంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News