హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దీంతో మంగళవారం వేకువజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు శైవక్షేత్రాలకు పోటెత్తారు. దీంతో శైవక్షేత్రాలు శివనామస్మరణతో కిటకిట లాడుతున్నాయి. అనేక రూపాల్లో దర్శినమిచ్చే మల్లికార్జున స్వామిని శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. తెలంగాణలోని కీసరగుట్ట, ఏడుపాయలు, వేయిస్తంబాల దేవాలయం, వేములవాడ రాజన్న ఆలయం, జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం, చెర్వుగట్టు, పానగల్ ఛాయా సోమేశ్వరాలయం.. ఎపిలోని శ్రీశైలం, సప్త నదుల సంగమేశ్వర ఆలయం, పంచారామక్షేత్రం సోమారామం ఆలయం, కోటప్పకొండ దేవాలయం వంటి శైవక్షేత్రాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
Maha Shivaratri: Huge Devotees visit Lord Shiva Temples