* ముగిసిన మహాశివరాత్రి జాతర మహోత్సవాలు
* తిరుగు ప్రయాణమైన యాత్రికులు
* ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం
వేములవాడ: సుప్రసిద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో గత మూడు రోజుల పాటు జరిగిన మహాశివరాత్రి జాతర ఉత్సవాలు శుక్రవారంతో ముగిసాయి. భక్తులు రాత్రంతా జాగారంలో ఉండి ఉదయాన్నే వంటలు చేసుకుని కుటుంబ సమేతంగా సహపంక్తి భోజనాలు చేసి, తమ ఒక్కపొద్దులను విడిచారు. అనంతరం జాతర భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు. ఆ మహాదేవునిడిని చల్లంగా చూడు రాజన్న….. వెళ్లొస్తాం రాజన్న అంటూ భక్తులు తమ స్వగ్రామాలకు తరళివెళ్లారు. 15 రోజుల నుండి జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో సమీక్షా సమావేశంలో జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించి, వాటిని విజయవంతంగా అమలు చేశారు. జిల్లా యంత్రాంగం ఇక్కడే తిష్టవేసి జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు.