Saturday, November 23, 2024

మహాశివరాత్రి: లింగోద్భవ సమయంలో శివుడిచ్చిన సందేశమేంటి?

- Advertisement -
- Advertisement -

లింగోద్భవ సమయం 01-03-2022 మంగళవారం రాత్రి తెల్లవారితే బుధవారం రాత్రి 12 గంటల 29 నిమిషాల 4 సెకెండ్ల నుండి 12 గంటల 31 నిమిషాల 59 సెకెండ్ల పాటు లింగోద్భవ కాలం.

సర్వేశ్వరుడైన ఈశుడు లింగస్వరూపుడూ అందులోనూ తేజో లింగస్వరూపుడై అవతరించిన మరుక్షణంలోనే మానవాళికి గొప్ప సందేశాన్ని ఇచ్చాడని వివరించే ఈ కథా సందర్భం శివపురాణంతో పాటు ఇతర పురాణాలలో కూడా ప్రస్తావితమై ఉంది. ఒక్క శివలింగానికి కాసింత పూజను, అభిషేకాన్ని ఏ రోజు చేసినా పుణ్యఫలమే. అందులోనూ శివరాత్రి వేళ లింగోద్భవ సమయంగా చెప్పే సమయంలో ఇక అలాంటి పూజలు, అభిషేకాలు చేస్తే ఎంత గొప్ప పుణ్యఫలం ప్రాప్తిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమేముంటుందని పురాణజ్ఞులు, పండితులు అంతా అనే మాట వాస్తవమే. అసలు మనిషి దైవ సందేశాన్నందుకొని లోక యాత్రలో పుణ్య పురుషుడుగా మెలగాలన్నదే మన ఆర్షవాణి, సంప్రదాయ పర్వదినాల అవతరణలో అసలు విషయం.

లింగోద్భవ సమయంలో శివుడిచ్చిన సందేశమేమిటి?
ఆభవుడికి, భవనాశనుడికి, శంకరుడికి నచ్చనిది ఏది? అనే విషయం కూడా ఇక్కడ ప్రస్తావితమై కనిపిస్తుంది. పూర్వం ఓసారి బ్రహ్మకు, విష్ణువుకు తాను గొప్పంటే తాను గొప్పన్న అహంకారం కలిగింది. అది కాస్త తీవ్ర రూపం దాల్చి యుద్ధ స్థాయికి చేరింది. లోకాలన్నీ ఆ తగవు లాటవల్ల భీతిల్లుతున్న తరుణంలో చంద్ర శేఖరుడు హరిబ్రహ్మలకు జ్ఞానాన్ని ప్రసాదించాలను కున్నాడు. వెంటనే వారి ముందు ఒక దివ్యతేజోరాశిని ఆద్యంతాలు తెలియని స్తంభలింగరూపంలో అవతరించేలా చేశాడు.

అప్పటిదాకా అక్కడ లేని ఆ దివ్యతేజోస్తంభం ఏమిటా అని హరి, బ్రహ్మలు యుద్ధంమాని విస్తుపోతూ చూశారు. వెంటనే పార్వతీ వల్లభుడు తన దివ్యలీలా విలాసంతో వారికి ఓ పరీక్ష పెడుతున్నానని, ఆ స్తంభం(లింగం) అగ్రభాగాన్ని ఒకరు, అడుగు భాగాన్ని మురొకరు చూసి రావాలని,ఎవరు ముందుగా వస్తే వారే గొప్పని,వారికే సర్వాధిపత్యం అని చెప్పాడు. వెంటనే బ్రహ్మ హంసరూపుడై ఆ తేజోలింగం అగ్రభాగానికి చేరటానికి వెళ్ళాడు.విష్ణువు వరాహరూపుడై ఆ లింగం మూలం ఎక్కడుందో తెలుసుకోవటానికి పాతాళం వైపు ప్రయాణం చేశాడు. హరి, బ్రహ్మలకు ఆ దివ్యతేజో రాశి ఆద్యంతాలు ఎంతకీ అంతు పట్టలేదు.

ఇంతలో పై నుండి ఒక కౌతకి (మొగలిపువ్వు) రావటం హంస రూపంలో ఉన్న బ్రహ్మ చూశాడు. బ్రహ్మ మొగలి పువ్వును ప్రలోభపెట్టి తాను ముందుగా తేజో రాశి అగ్రభాగాన్ని చూశానని చెప్పుకోవటానికి సాక్ష్యంగా ఉండమని కోరాడు. పాతాళం వైపు వెళ్ళిన విష్ణువుకు తేజోరాశి పీఠభాగం ఎంత దూరం వెళ్ళినా కనిపించలేదు. ఇంతలో అబద్ధపు సాక్ష్యం చెప్పేందుకు మొగలి పువ్వును వెంట పెట్టుకొని శివుడి దగ్గరకొచ్చాడు. బ్రహ్మ, ఆ తర్వాత కొద్ది సేపటికి విష్ణువు తేజోలింగం అడుగు భాగం తాను కనుక్కోలేక పోయానని బాధపడుతూ పై కొచ్చాడు.

శివుడికి బ్రహ్మ తేజోరాశి అగ్రభాగాన్ని తాను చూశానని అందుకు సాక్ష్యంగా కేతకిని కూడా వెంటపెట్టుకొచ్చానన్నాడు. ఆ అసత్య మాటలకు శివుడికి కోపం ముంచుకువచ్చిది. వెంటనే భైరవుడిని సృష్టించి అసత్యమాడి నందుకు బ్రహ్మను దండించ మన్నాడు. భైరవుడు అప్పటిదాకా బ్రహ్మకున్న ఐదుతలలలో అబద్ధం ఆడిన తలను తుంచేశాడు. తరువాత తప్పును తెలుసుకున్న బ్రహ్మ ఈశుడిని శరణు వేడుకొన్నాడు. పక్కనే ఉన్న విష్ణువు కూడా అప్పటికే శివుడి గొప్పప్పతనాన్ని గ్రహించి శివుడికి నమస్కరించాడు.

బ్రహ్మ తప్పును క్షమించమని కూడా వేడుకున్నాడు. శరణాగత వత్సలుడైన శంకరుడు చల్లబడ్డాడు. ఇంతకు ముందు లాగానే బ్రహ్మకు సృష్టి అధికారం ఉంటుందని, అయితే ఇతర దేవతల్లాగా బ్రహ్మకు ఆలయాలు, పూజలు ఏవీ ఉండవని చెప్పాడు. అబద్ధం ఆడకుండా వాస్తవాన్ని తెలిపిన విష్ణువు అందరి చేత పూజలందుకుంటాడని, స్థితి కారకుడిగా వెలుగొందుతాడని అన్నాడు.

మొగలిపువ్వును చూసి అసత్యమాడిన పాపానికి తన పూజలో మొగలిపువ్వుకు చోటుండదని అన్నాడు. అయితే ఆ కేతకి శివుడికి పరిపరివిధాల ప్రణమిల్లింది. భక్తవత్సలుడైన శివుడు అప్పుడు కొంత శాంతించి శివపూజకు పనికి రాకపోయినా శివభక్తులు మాత్రం మొగలిపువ్వును ధరిస్తారని, అలా జన్మను చరితార్థం చేసుకోమని చెప్పి అంతర్థాన మయ్యాడు. ఈ కథా సందర్భంలో ఎంతటి వారైనా అసత్యమాడితే పాపఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని తెలియజెప్పే సందేశం ఇమిడి ఉంది. మానవులాంతా సత్యమార్గంలోనే నడుచుకోవాలన్న ఈశ్వర సందేశం ఇక్కడ కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News