Thursday, January 23, 2025

గిరిజన శివాత్మికురాలు గుండం రామక్క

- Advertisement -
- Advertisement -

దట్టమైన పాఖాల అటవీప్రాంతం ఒకప్పుడు కాకతీయుల ఏలుబడిలో ఉండేది. క్రీ.శ 1213లో ఓరుగల్లు సామ్రాజ్యాన్ని పరిపాలించిన కాకతీయ చక్రవర్తి ప్రతాప రుద్రుని కాలంలో పాఖాల సరస్సుకు అనుకొని దట్టమైన గుట్టల మధ్యలో గల గుండంపల్లి ప్రాంతంలో శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం నిర్మించబడింది. ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా జాగరణ, పూజలు జరుగుతాయి.పాఖాల సరస్సును సందర్శించినవారు తప్పక చూడవలసిన ప్రదేశం ఇది. అయితే, సరైన రహదారి, రవాణా సౌకర్యం లేక ఈ దేవాలయం నిత్యపూజలకు నోచుకోలేకపోతోంది. పర్యాటక ప్రాంతంగా వెలుగొందాల్సిన గుండం-తిమ్మాపూర్ గుడికి ఆదరణ, భద్రత లోపించింది. దీంతో నిధులున్నాయని ఆశతో కొందరుదుండగులు 1985లో బాంబులు పెట్టి శివలింగాన్ని ధ్వంసం చేశారు. అప్పటి నుంచి ప్రతి శివరాత్రికి నాగుపాము మూడు రోజుల పాటు శివలింగం ఉండే గదిపై ఉంటున్నదని నిర్వాహకులు చెబుతున్నారు. నేడు గుడి శిథిలావస్థకు చేరుకుంది. దేవాలయానికి సంబంధించిన భూమి ఐదు ఎకరాలు ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకునే వారు లేక అన్యాక్రాంతమైంది.

నర్సంపేట నుండి 20 కి.మీ, కొత్తగూడెం నుంచి 14 కి.మీ దూరంలో గుండం శివాలయం ఉంటుంది. ఈ శివాలయం పక్కన వెంకటేశ్వర స్వామి గుడి ఉండటం ఓ ప్రత్యేకత. రాజన్న భక్తులు గిరిజన శివారాధకురాలైన రామక్కకు ప్రత్యేకంగా పూజలు చేయడం ఇక్కడి విశేషం. పాఖాల కొత్తగూడెం మండలం గుండం తిమ్మాపురం గ్రామానికి చెందిన కోయ గిరిజన తెగలోని రామక్క గొప్ప శివభక్తురాలు. రాముడికి శబరి(సవర) ఎలా భక్తురాలో ఈ ప్రాంతంలో రామక్క (కోయ శివ భక్తురాలుగా కీర్తికెక్కింది. ఈమె గట్టి (ఇంటి) వంశస్థుల ఆడబిడ్డ. రామక్క ప్రతి రోజు గుండం చెరువులో స్నానం చేసి శివునికి పూజలు చేసేది. అందువల్ల ఆ శివాలయాన్ని ఇప్పటికీ ‘రామక్క గుడి’గా పిలుస్తున్నారు. గుండం చెరువులో ఒక వెండి గుడి ఉండేదని అందులో బంగారు ఆభరణాలు ఉండేవని ప్రతీతి. పూర్వం రామక్కవంశీయులు పేరంటాలకు పోతున్నప్పుడు రామక్క దగ్గరకు వెళ్లి నగలు కావాలని కోరితే ఆమె చెరువు లోపలి నుంచి బయటకు వచ్చి వారికి కావాల్సినన్ని ఇచ్చేది.

వారు తిరిగి వాటిని ఇచ్చే ముందు ఒక ఇత్తడి తాంబూలంలో పెట్టి నీటిలో వదిలేవారు. ఈ విధంగా రామక్క గట్టి వారి వంశీయుల దేవతామూర్తిగా వెలిసింది. కొంత మంది స్వార్థపరులు ఆమె వద్ద నగలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా దుర్భాషలాడటంతో రామక్క ఆగ్రహించి మానవులు నీతివంతులు కాదాని, స్వార్ధపరులని శపించడంతో వారు రాళ్లుగా మారారని అంటారు. దీంతో నేటికీ గుండంలో స్నానం చేయడానికి ఎద్దు చర్మం కట్టుకొని వెళ్లే అనవాయితీ కొనసాగుతోంది. గ్రామస్థులు యేటా మొక్కజొన్న విరిచే సమయంలో సొప్ప కర్రలను కట్టగా కట్టి, అందులో మంగళహారతిని పెట్టి నీటిలో వదిలేస్తారు.నేరుగా చెరుపు మధ్య వరకు వెళ్లి అక్కడ మునుగుతుందని, ‘సత్యం గల తండ్రివి శివయ్య’ అని మొక్కితే కోరికలు నెరవేరుతాయని వారి ప్రగాఢ నమ్మకం.పూజలుచేస్తున్న సందర్భంలో ఒకసారి భీముడు శివాలయంపై అడుగుపెట్టాడు. రామక్క ‘ఎవరని..’గట్టిగా అరవడంతో కాలు పడిన గుడి ముందు భాగం మాత్రమే పాక్షికంగా ఒరిగింది అని గుండం పరిసర గ్రామ ప్రజలు చెబుతున్నారు.

రామక్కకు శివుడు కలలో కనిపించి కేవలం భక్తురాలిగానే ఉంటూ ఏ విషయాలు ఇతరులతో మాట్లాడినా నీకు గండం కలుగుతుందని హెచ్చరిస్తాడు.ఒకానొక సమయంలో ఒక ముసలమ్మకు కొన్ని రహస్యాలు చెప్పవలసిన వస్తుంది. ఈ సూచనను పాటించకపోవడంతో రామక్క శివైక్యం చెందుతుంది. ఆమె కోరిక ప్రకారం గుండం చెరుపుపక్కన ఆచారానికి విరుద్ధంగా ఆమె ను పాతిపెట్టారు. ఆ ప్రాంతాన్ని ‘జడల రామక్క పోలు’గా పిలుస్తారు. ఆమె పొడుగ్గా కొప్పు జడతో, ముక్కుకు ముక్కెర, చెవులకు గంటీలతో, చీర చెక్కుకొని ఉండేదని అంటారు. ఆమె స్మృత్యర్థం ఆరేళ్ల కిందట విగ్రహం నెలకొల్పారు వారి వంశస్థులు. గుండం చెరువులోతు ఏడు మంచాల నులక చేసిన తెలియదు అంటారు. ఇంతటి ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన గుండం శివాలయంలో గిరిజనులు, గిరిజనేతరులు కలిసి శివరాత్రి సందర్భంగా ప్రతి యేటా 3 రోజులు జాతర నిర్వహిస్తారు.

గట్టి బాబు, గట్టి రమేష్, గట్టి సత్యనారాయణ, దానం నారాయణ, గుళ్లపల్లి శ్రీను, బిట్ల వేణు, పెనక సతీష్ ఆలయ కమిటీలో ఉన్నారు. ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం లేదు.ఒక్క శివరాత్రికి తప్ప గుండం శివాలయం ఉందన్న సంగతి బాహ్య ప్రపంచానికి తెలియకపోవడంతో అత్యంత నిరాదరణకు గురయింది. దాదాపుగా శిథిలావస్థకు చేరుకుంది. ప్రభుత్వం ఇకనైనా గుండం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా గుర్తించి అభివృద్ధి చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News