పుణె : త్రైపాక్షిక మహా వికాస్ అఘాడీ కూటమి చెక్కు చెదరదని, ఈమేరకు అవసరమైన ప్రయత్నాలు తీసుకోవడమౌతుందని ఎన్‌సిపి సీనియర్ నేత అజిత్ పవార్ ఆదివారం పుణె జిల్లా బారామతిలో విలేకరులతో మాట్లాడారు. మహావికాస్ అఘాడీ ఇంతకు ముందు మాదే, ఇప్పుడూ మాదే, భవిష్యత్తులోనూ మాదే అని ఆయన స్పష్టం చేశారు. ఎన్‌సిపి ఛీఫ్‌గా తన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్టు శుక్రవారం ముంబైలో ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్ పత్రికా సమావేశంలో వెల్లడించినప్పుడు ఆ సమావేశంలో పాల్గొనక పోవడంపై ప్రశ్నించగా, ఊహాగానాలను ఆయన కొట్టి పారేశారు.
Also Read: అమెరికాలో మరోసారి పేలిన తుపాకీ
రాజీనామాను శరద్ పవార్ ఉపసంహరించుకోవడం ఎంవిఎలో అత్యుత్సాహాన్ని ప్రేరేపించిందని పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా గందర గోళ వాతావరణం నెలకొనడంపై ప్రశ్నించగా, అదంతా మీడియా,తన “శ్రేయోభిలాషుల” పని అని వ్యంగ్యంగా ఆరోపించారు. తన పనితీరుకు అసూయ పడేవారు, తనను“ ప్రేమించే” వారు అలాంటి గందర గోళం సృష్టించారని వ్యాఖ్యానించారు. ముంబై పత్రికా సమావేశానికి ఎన్‌సిపి నుంచి ప్రతివారూ పాల్గొంటారా ? అని ప్రశ్నించారు. ముంబైలో జరిగిన సమావేశం అది కేవలం మీడియా సమావేశమని, రాష్ట్ర ఎన్‌సిపి చీఫ్ జయంత్ పాటిల్, ప్రఫుల్ పటేల్, కేరళ, ఉత్తరాది, నుంచి కొంతమంది నాయకులు పాల్గొన్నారని, నన్ను రావద్దని పవర్ సాహెబే చెప్పారని పేర్కొన్నారు. ఆయన నిర్ణయం మేరకు ఇతరులు ఎవరూ ఆ సమావేశానికి హాజరు కాలేదన్నారు.