Monday, December 23, 2024

మారుమూల తండా నుంచి.. ఎవరెస్టు అధిరోహణకు..

- Advertisement -
- Advertisement -

మరిపెడః సరదాగా చేసిన ట్రెక్కింగ్ ఆ యువకుడిని పర్వతారోహణ వైపు నడిపించింది. మారుమూల తండాలోని రాతి గుట్ట నుంచి మొదలైన ప్రస్ధానం ఇప్పుడు ఎవరెస్టు దిశగా సాగుతొంది. గిరిజన సహస వీరుడు భూక్య యశ్వంత్ నాయక్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకోవడానికి రెడి అవుతున్నాడు. ఇప్పటికే ప్రపంచంలోని ఖర్డుంగ్‌లా, కిలిమంజారో, యునామ్, ఎల్బ్రస్ పర్వతాలను అవలీలగా చుట్టేసి ఎంతో ప్రసిద్ధిగాంచిన పర్వత శ్రేణులపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి భారత దేశ ఔన్నత్వాన్ని యావత్ ప్రపంచానికి చాటాడు. ప్రస్తుతం ప్రపంచం కెల్లా ఎత్తయిన ఎవరెస్టు శిఖర పర్వతారోహణకు భూక్య యశ్వంత్ నాయక్ ఎంపికైయ్యాడు.
చిన్పప్పటి నుంచి సాహసమే శ్వాసగా..
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యతండా గ్రామ పంచాయితీకి చెందిన భూక్య రాంమూర్తినాయక్, జ్యోతి గిరిజన దంపతుల కుమారుడు భూక్య యశ్వంత్ హైదరాబాద్ ఇబ్రహింపట్నంలోని ఎన్‌డిసి కళాశాలలో ఈ ఏడాది ఇంటర్ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి యశ్వంత్ పర్వతారోహణ అంటే మక్కువ. ఈ ఇష్టం తోనే అనేక రాక్ క్లైంబింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. ఆ ఇష్టంతోనే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పర్వతాలు అధిరోహించి అనేక సహసాలు చేస్తున్నాడు. తండ్రి భూక్య రాంమూర్తినాయక్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్ (ఆర్టిజన్)గా విధులు నిర్వహిస్తుండగా, తల్లి జ్యోతి కూలీ పనులు చేస్తూ కుమారుడైన యశ్వంత్‌కు ఇష్టమైన పర్వతారోహణను ప్రోత్సహిస్తున్నారు.
ఎత్తయిన పలు పర్వతారోహణలు..
2021 జూన్ నెలలో ప్రపంచంలోని ఎత్తయిన ప్రసిద్ధిగాంచిన జమ్మూకాశ్మీర్ లేహ్ లడఖ్ ప్రాంతంలోని ఖర్డుంగ్‌లా 5, 602 మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతాన్ని అధిరోహించాడు. అదే విధంగా అదే ఏడాది ఆగస్టు నెలలో దక్షిణాఫ్రికా టాంజానియలోని కిలిమంజారో 5, 895 మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరాన్ని ఆరు రోజుల్లో అధిరోహించాడు. 2022 జూన్‌లో హిమాచల్ ప్రదేశ్ లాహోర్ జిల్లా బరాలాచలా పాస్ సమీపన సముద్ర మట్టానికి 6, 111 మీటర్ల ఎత్తులో ఉన్న యునామ్ మంచు పర్వత శిఖరాన్ని అధిరోహించి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి సాహసోపేతమైన పర్వతారోహణతో తెలంగాణ రాష్ట్ర, భారత దేశ ఖ్యాతిని చాటాడు. యశ్వంత్ రష్యాలోని మరో పర్వతం ఎల్బ్రస్ పర్వతారోహణకు ఎంపికగా.. సెప్టెంబర్ 2022లో యూరప్ ఖండం రష్యాలోని నిద్రాణమైన ఎల్బ్రస్ అగ్నిపర్వతం 5, 642 మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరం అధిరోహించి భారత జాతీయ జెండాను ఎగరవేశాడు.
ప్రపంచంలోని ఎత్తయిన ఎవరెస్టుకు ఎంపిక..
ప్రపంచంలోనే అతి ఎత్తయిన పర్వత శ్రేణి ఎవరెస్టును భూక్య యశ్వంత్‌కు స్పాన్సర్‌గా ఎస్‌ఆర్ సాప్ట్‌వేర్ సొలిషియ ప్రైవేట్ లిమిటెడ్ వారు ముందుకు వచ్చి ఎంపిక చేశారు. ముందుగా బేస్ క్యాంపు ఈ నెల 30వ తేదీన వెల్లనున్నాడు. అనంతరం ఆగస్ట్ నెలలో నేపాల్‌లోని 8, 848. 86 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించనున్నట్లు యశ్వంత్ తెలిపారు. ప్రభుత్వం, దాతలు పర్వతారోహణకు సహకారం అందిస్తే మరిన్ని విజయాలు సాధిస్తానని యశ్వంత్ తెలిపారు. పిన్న వయస్సులో ప్రాణాలకు తెగించి పర్వతారోహణ చేసి భారత దేశ ఖ్యాతిని చాటుతున్న తమ కుమారుడికి ప్రభుత్వ పరంగా సాయం అందించాలని యశ్వంత్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. మౌంట్ ఎవరెస్టుకు ఎంపికైన భూక్య యశ్వంత్‌ను పలువురు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News