ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలుల్లో ఉండటంలో మంగళవారం జరగాల్సిన కౌంటింగ్ జూన్ 2వ తేదీకి వాయిదా వేయాలని సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 5వ తేది నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అందులో పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16న పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. అదే రోజు నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి సైతం అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తే, ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై చూపే అవకాశం ఉన్నందున లెక్కింపు జూన్ 2వ తేదికి వాయిదా వేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు వెల్లడించారు.ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ మార్చి 28న నిర్వహించగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాల పరిధిలో 1437 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మొత్తంగా 99.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇద్దరు ఎంపిలు, 14 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ ఎంపిడివో కార్యాలయంలో,మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబ్‌నగర్ బాలుర జూనియర్ కళాశాల స్ట్రాంగ్ రూంలో ప్రస్తుతం బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. ఎన్నికల కోడ్‌తో ఓట్ల లెక్కింపు అక్కడే జరగాల్సి ఉండగా వాయిదా పడింది.స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేయడంతో మార్చి 28న ఉప ఎన్నిక నిర్వహించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బిఆర్‌ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్ గౌడ్ బరిలో నిలిచారు.