ఎక్సైజ్, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్: పాలమూరును నలువైపులా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని ఎక్సైజ్, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం మున్సిపల్ బడ్జెట్ (2021- 22) సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రితో పాటు కలెక్టర్ వెంకట్రావ్ హాజరయ్యారు. సమావేశానికి అధ్యక్షతన వహించిన మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సిములు బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ… మున్సిపాలిటీ పరిధిలో గతంలో 10 నుంచి 15 రోజులకు తాగునీరు వచ్చేదని ప్రస్తుతం ప్రతిరోజూ నీళ్లు వదులుతున్నామన్నారు. దీంతో ఆడపడుచులకు తాగునీటి గోస తప్పిందన్నారు. జడ్చర్ల వైపు జాతీయ స్థాయిలో ఎకో పార్కు అభివృద్ధి చేశామని, భూత్పూర్ వైపు నూతన కలెక్టర్ భవనం నిర్మిస్తున్నామని, త్వరలో వీరన్నపేటలో రెసిడెన్సియల్ స్కూల్ నిర్మిస్తామన్నారు.
పాలమూరు పట్టణంతో పాటు చుట్టూ కూడా అభివృద్ధి అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. ఎలక్ట్రికల్ సెల్ కంపెనీ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. చించోలీ నుంచి మహబూబ్‌నగర్‌కు 4లైన్ల రోడ్డుకు అనుమతి లభించిందన్నారు. దివిటిపల్లిలో నిర్మించిన డబుల్‌బెడ్రూం ఇళ్లను దసరాకు లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. వాలీబాల్ అకాడమీతో పాటు ఇండోర్‌స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు. పాలమూరు శరవేగంగా ప్రగతి సాధిస్తుందని దీనికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. 2021-22 సంవత్సరానికి బడ్జెట్ 1,33,39.68లక్షలుగా అంచనా వేశారు. ఇందులో పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యత, గ్రీన్‌బడ్జెట్, నర్సరీలు, హరితహారం, వైకుంఠధామాలు, పట్టణ ప్రకృతి వనాలు, వీధి వ్యాపారుల సముదాయాలు, వీధి వ్యాపారులకు రుణ సదుపాయాలు, పబ్లిక్ టాయిలెట్స్, పట్టణ ప్రగతి నిధులు, సెంట్రల్ మిడయన్స్, ప్రధాన కూడళ్ల అభివృద్ధి, పార్కులు, టీఎస్‌బీపాస్, మిషన్ భగీరథ, రోడ్ల విస్తరణ, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ సంబంధించి నిధుల వివరాలు బడ్జెట్‌లో పొందుపర్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవార్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, డీఎస్పీ శ్రీధర్, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.