మహాదేవ్ యాప్ ఆన్‌లైన్ బెట్టింగ్ స్కామ్ కేసులో కీలక పరిమాణం చోటుచేసుకుంది. బెట్టింగ్ స్కామ్‌పై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) తన ఎఫ్‌ఐఆర్‌లో ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ పేరును పేర్కొంది. ఛత్తీస్‌గఢ్ ఆర్థిక నేరాల విభాగం (ఇఒడబ్ల్యూ) దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో బాఘేల్ పేరును చేర్చింది. ఇప్పుడు సిబిఐ కేసులోనూ ఆయన పేరును చేర్చడం జరిగింది. సిబిఐ ఇటీవల ఛత్తీస్‌గఢ్, భోపాల్, కోల్‌కతా, ఢిల్లీ అంతటా 60కి పైగా ప్రదేశాలలో విస్తృత దాడులు నిర్వహించింది. రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసు అధికారులు, బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌తో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ఈ సోదాలు చేసింది.
మహాదేవ్ యాప్ స్కామ్ అంటే ఏమిటి?
మహాదేవ్ బుక్ అనేది రవి ఉప్పల్, సౌరభ్ చంద్రకర్ ప్రోత్సహించిన ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్. వీరిద్దరూ తమ అక్రమ బెట్టింగ్ నెట్‌వర్క్‌ను సాఫీగా నిర్వహించడానికి ప్రభుత్వ అధికారులకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించారని దర్యాప్తులో తేలింది. ఈ కేసును మొదట ఛత్తీస్‌గఢ్ ఆర్థిక నేరాల విభాగం (ఇఒడబ్ల్యూ) దర్యాప్తు చేసింది. తరువాత, రాష్ట్ర ప్రభుత్వం.. సీనియర్ అధికారులు, ఇతర కీలక నిందితుల ప్రమేయంపై సమగ్ర దర్యాప్తును నిర్ధారించడానికి దానిని CBIకి అప్పగించింది.