Thursday, January 23, 2025

దుబాయ్ పోలీస్‌ల అదుపులో ‘మహదేవ్’ యజమాని రవి ఉప్పల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల కలకలం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ వ్యవహారానికి సంబంధించి యాప్ యజమానుల్లో ఒకరైన రవి ఉప్పల్ ను దుబాయ్‌లో అదుపు లోకి తీసుకున్నారు. ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీస్ ఆధారంగా గత వారమే పోలీస్‌లు రవిని అదుపు లోకి తీసుకున్నారు. అతడిని భారత్‌కు తీసుకు వచ్చేందుకు దుబాయ్ అధికారులతో ఈడీ సంప్రదిస్తోంది. మరో యజమాని సౌరభ్ చంద్రశేఖర్ కోసం దుబాయ్ పోలీస్‌లు గాలిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ లోని భిలాల్ ప్రాంతానికి చెందిన రవి ఉప్పల్, సౌరభ్ చంద్రశేఖర్ దుబాయ్ కేంద్రంగా భారత్‌లో మహదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్నారు.

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ పేరున మనీలాండరింగ్ సాగిస్తున్నారు. దీనిపై ఈడీ రంగం లోకి దిగి ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న కోల్‌కతా, భోపాల్ ముంబై వంటి నగరాల్లో సోదాలు చేపట్టింది.రూ. వందల కోట్లలో అక్రమ నగదు బయటపడింది. యాప్ ద్వారా వచ్చే మొత్తాన్ని ఆఫ్‌షోర్ ఖాతాలకు తరలించేందుకు హవాలా మార్గాన్ని అనుసరిస్తున్నట్టు ఈడీ గుర్తించింది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేసింది. రవి ఉప్పల్‌కు వనౌటు దేశ పాస్‌పోర్ట్ ఉందని దాన్ని ఉపయోగించి అనేక దేశాల్లో తిరుగుతున్నాడని దర్యాప్తులో తేలింది. భారత పౌరసత్వాన్ని వదులుకోక పోయినా, దీని పైనే ఆస్ట్రేలియా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్టు ఈడీ తెలిపింది.

యాప్ మరో ప్రమోటర్ సౌరభ్ చంద్రశేఖర్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఏఈ లో ఘనంగా వివాహం జరిగింది. దీనికోసం రూ.200 కోట్లు ఖర్చు చేసినట్టు ఈడీ గుర్తించింది. ఈ పెళ్లికి బాలీవుడ్ లోని ప్రముఖ సెలబ్రిటీలు కూడా హాజరైనట్టు ఈడీ పేర్కొంది. ఈ కేసులో రవి ఉప్పల్, సౌరభ్ చంద్రశేఖర్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఈడీ అభ్యర్థన మేరకు వీరిద్దరిపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. అయితే ఈ మనీలాండరింగ్ ఆరోపణలను రవి ఉప్పల్, సౌరభ్ చంద్రశేఖర్ ఖండించారు.

దీంతో తమకెలాంటి సంబంధం లేదని, శుభమ్ సోని అనే వ్యక్తి ఈ యాప్‌ను నడిపిస్తున్నాడని వారు పేర్కొన్నారు. ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ పైనా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. బఘేల్‌కు ఈ యాప్ ప్రమోటర్లు రూ.508 కోట్లు చెల్లించినట్టు క్యాష్ కొరియర్ ఆసిమ్‌దాస్ తన వాంగ్మూలంలో చెప్పాడని ఈడీ ఆరోపించింది. చత్తీస్‌గఢ్ ఎన్నికలకు ముందు ఆసిమ్‌ను పోలీస్‌లు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ. 5 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ డబ్బును తనకు శుభమ్ సోని ఇచ్చాడని ఆసిమ్ చెప్పినట్టు ఈడీ పేర్కొంది. అయితే అధికారులు తమతో బలవంతంగా వాంగ్మూలంపై సంతకం చేయించినట్టు ఆసిమ్ జైలు అధికారికి తెలియజేస్తూ లేఖ రాసినట్టు వార్తలు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News