Saturday, November 23, 2024

ఉరిమిన వరి

- Advertisement -
- Advertisement -

Mahadharna of Telangana farmers in Sirisilla

ధాన్యం ధర్నాలతో దద్దరిల్లిన రాష్ట్రం

టిఆర్‌ఎస్ అంటే తెలంగాణ రైతు సమితి, కేంద్రం దిగివచ్చే వరకు ఉద్యమం ఆగదు
సిరిసిల్లలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సింహనాదం

1960లలోనే లాల్ బహదూర్ శాస్త్రి ‘జై జవాన్ జై కిసాన్’ నినాదం
ఇచ్చారు తెలంగాణ జై కిసాన్ జై కిసాన్ అంటుంటే బిజెపి పాలకులు నై
కిసాన్ నై కిసాన్ అంటున్నారు దేశంలో అన్ని వనరులూ ఉన్నా చేతకాని
పాలకుల దిక్కుమాలిన రాజకీయాల వల్ల దివాళాకోరు విధానాల వల్ల
అభివృద్ధికి దూరమై ప్రపంచం ముందు తలవంచుకుంటున్నాం ఉత్తరాదిలో రైతులు కార్పొరేట్ల శక్తుల ముందు మోకరిల్లేలా
చేయొద్దంటూ ఆందోళన చేస్తుంటే బిజెపి కేంద్రమంత్రి కొడుకు రైతులపై
బండి తోలి ఎనిమిది మంది మృతికి కారణమయ్యాడు తెలంగాణ
ప్రాజెక్టులకు కేంద్రం బుడ్డ పైస కూడా సాయం చేయలేదు పక్క
రాష్ట్రంలో పోలవరానికి ఇచ్చినట్టుగా తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకూ
జాతీయ హోదా ఇవ్వలేదు కేంద్రం ప్రత్యామ్నాయం పంటలు
వేయాలంటుంటే ఇక్కడున్న గల్లీలోని సిల్లీ బిజెపి నేతలు యాసంగిలో వరి
వేయాలని ప్రచారం చేస్తున్నారు బండి సంజయ్ కాదు తొండి సంజయ్
: సిరిసిల్లలో తెలంగాణ రైతుల మహాధర్నా వేదిక నుంచి కెటిఆర్

మన తెలంగాణ / సిరిసిల్ల : యాసంగి వడ్లు కొనేందుకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేవరకు రైతులందరూ తెరాసతో కలిసికట్టుగా ఉద్యమం చేయాలని, తెలంగాణలోని రైతు వేదికలన్నీ ఉద్యమ కేంద్రాలుగా మారాలని ఐటి, పురపాలక, పట్టణాభివృధ్ధి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు పిలుపునిచ్చారు. శనివారం సిరిసిల్లలో నిర్వహించిన తెలంగాణ రైతుల మహధర్నా కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ మాట్లాడారు. రైతులు తిరుగబడితే కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం రైతుల ఎడ్ల బండి, ట్రాక్టర్ చక్రాల క్రింద పడి కొట్టుక పోతారని, అధికారం కోల్పోక తప్పదని హెచ్చరించారు. డిల్లీలోని బిజేపి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తాము చిత్తశుధ్దితో పాటించి యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయించాలని రైతులను, అధికారులను చైతన్య పరుస్తూ, అప్రమత్తం చేస్తుంటే గల్లీలోని బిజేపి సిల్లీఫెలోస్, కరీంనగర్ ఎంపి బండి (తొండి) సంజయ్ ఓట్ల కోసం యాసంగిలో వరి పంట వేయాలని, కొనుగోలు చేయకపోతే మెడలు వంచుతామని ప్రకటిస్తున్నారని, ఈయన ఎవరి మెడలు వంచుతారని కెటిఆర్ నిలదీశారు. కేంద్రం యాసంగిలో వరి ధాన్యం కొంటామంటే వద్దనే వారెవరని ఆయన ప్రశ్నించారు.

బిజేపి కేవలం మత రాజకీయాలు చేస్తోందని, హిందూ, ముస్లింల పేరిట, దేశ సరిహద్దుల పేరిట ప్రజలను రెచ్చగొడుతోందన్నారు. ఇప్పటి వరకు బిజేపి నాయకులు ఇష్టారాజ్యంగా సిఎం కేసిఆర్‌ను తిడితే కూడా సహించామని, కాని రైతులను తిప్పలు పెడితే,వారిని తప్పు పడితే సహించమన్నారు. ఓట్ల కోసం గళ్లీ బిజేపి ఫెలోస్ చలిమంటలు పెడితే చూస్తూ ఊర్కోమన్నారు.బిజేపి దివాళకోరు రాజకీయాల వల్ల రైతులు నష్టపోతుంటే సహించమన్నారు. ఇప్పటి వరకు టిఆర్‌ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితిగా అర్థం చేసుకున్నామని ఇకపై టిఆర్‌ఎస్ అంటే తెలంగాణ రైతు సమితిగా ముందుకు సాగుతామన్నారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాదిలో ఏడాది కాలంగా రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని, తమను కార్పోరేట్ శక్తుల ముందు మోకరిల్లేలా చేయవద్దని ఆందోళన చేస్తుంటే బిజేపి కేంద్ర మంత్రి కొడుకు రైతులపై బండి తోలి ఎనిమిది మంది మృతికి కారకుడయ్యాడన్నారు. ఈ ఘటనలో 8 మంది రైతులు చనిపోతే, అనేకమంది రైతులు గాయాల పాలైతే ప్రధాని మోడి గాని కేంద్రం గాని కనీసం సంతాపం కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదన్నారు. తెలంగాణలో నిర్మించిన ప్రాజెక్టులకు కేంద్రం బుడ్డ పైస కూడా సహయం చేయలేదన్నారు.

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని పక్క రాష్ట్రంలో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చినట్లుగా తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమంటే మొండి చెయ్యి చూపారన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ తెలంగాణలో నిర్మిస్తున్న మంచి ప్రాజెక్టులకు కనీసం ఐదు వేల కోట్ల రూపాయలైనా సహయం చేయాలని సూచిస్తే కనీసం 5 బుడ్డ పైసలు కూడా ఇవ్వలేదన్నారు. దేశ ఆర్థికాభివృధ్ధికి దోహదం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర అభివృధ్ధిని అడ్డుకోవడానికి కేంద్రం నుండి ఒక్క రూపాయి ఇవ్వక పోగా అభివృధ్ధిని నిరోదించేందుకు కాళ్లలో కట్టెలు ఇరికించే పనులకు దిగుతున్నారన్నారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసేవరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేంద్రం ఇలా నీలిగితే సిఎం కెసిఆర్ ఆనాడు అనేక రకాలుగా పోరాటాలు చేసి, చివరికి ఆమరణ దీక్షకు దిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నట్లే ఇప్పుడు కూడా కేంద్రం దిగి వచ్చేవరకు ఉద్యమిస్తామన్నారు. రైతన్నలకు మద్దతుగా నిలిచేందుకే సిఎం కెసిఆర్ ధర్నాలకు పిలుపునిచ్చారన్నారు. తెలంగాణ రాక పూర్వం సమైక్యాంధ్ర పాలకుల కాలంలో తెలంగాణ రైతులు ఎదుర్కొన్న దుస్థితి వర్ణణాతీతమన్నారు.

విత్తనాలు, ఎరువుల కోసం క్యూ లైన్లు కట్టాల్సి వచ్చేదన్నారు. కరెంట్ కొరతలతో రోజుకు ఆరు గంటల కరెంట్‌ను మూడు కిస్తుల్లో ఇచ్చేవారన్నారు. అది కూడా సక్రమంగా వచ్చేది కాదన్నారు. భూ గర్భ జలాలు అడుగంటి ఒక్కో రైతు పదుల కొద్ది బోర్లు వేసి అనేక కష్ట నష్టాలను ఎదుర్కొన్నారన్నారు. ఒక్క ప్రాజెక్టు కట్టలేదని, చెరువులు, కుంటలు నిర్లక్షానికి గురయ్యాయన్నారు. మైనర్ ఇరిగేషన్ శాఖ ఉన్నా దానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించేవారు కాదన్నారు. సమైక్యాంధ్రలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉండేవన్నారు. ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణలో సిఎం కెసిఆర్ దేశం అబ్బుర పడేలా ఏడు దశాబ్దాల దుష్పరిపాలనకు తెరదించి, రైతులకు 24గంటలు ఉచిత కరెంట్ అందించారన్నారు.దేశమంతా ఇదెలా సాధ్య పడిందని నివ్వెర పోయిందన్నారు. కెసిఆర్ ఏం మ్యాజిక్ చేశారని అడిగారన్నారు. కెసిఆర్ లాంటి సరైన నాయకుడుంటే ఇలాంటివన్నీ సాధ్యపడతాయని నిరూపించారన్నారు.

దేవుడు కూడా పనిచేసేవారికి సహకరిస్తారని గత ఏడున్నరేళ్ల కెసిఆర్ పాలనలో కరువు అనేదే రాలేదన్నారు. కెసిఆర్ ముందు జాగ్రత్త చర్యగా దేశంలో ఎవరూ కొనని కాలంలో యూరియా వంటి ఎరువులను, విత్తనాలు ముందుగా కొనుగోలు చేసిపెట్టి రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూశారన్నారు. తెలంగాణలో విత్తనాల కోసం యుద్ధాలు లేవు, ఎరువుల కోసం వీధి పోరాటాలు లేవన్నారు. మైనర్ ఇరిగేషన్ శాఖ ద్వారా కాకతీయుల నాటి గొలుసుకట్లు చెరువులను మిషన్ కాకతీయ పథకం క్రింద 20 వేల కోట్లు కేటాయించి అభివృధ్ది చేశారన్నారు. ఎంతటి వరదలు వచ్చినా తట్టుకునేలా తీర్చిదిద్ది ఒక్క చెరువు కూడా తెగిపోకుండా చూశారన్నారు. చెరువుల వల్ల కుల వృత్తులు, రైతులు, పల్లె ప్రాంతాలు అభివృధ్ధి చెందేలా చర్యలు తీసుకున్నారన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కూడా దేశంలో ఎవరూ ఆలోచించని విధంగా 2017లో 16 వేల కోట్లతో రైతులకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేశారన్నారు. ఎకరానికి 5 వేల రూపాయలు రైతు బంధు అందిస్తున్నారన్నారు. దీంతో తెలంగాణ ఆదర్శంగా దేశంలోని 11 రాష్ట్రాలు, చివరికి కేంద్రం కూడా దేశ వ్యాప్తంగా 16 వేల కోట్లతో రైతు బంధు అమలు చేయడానికి ముందుకు వచ్చిందన్నారు.

రైతు పక్షపాతి అయిన కెసిఆర్ రైతులకు మరో పథకం అమలు పర్చాలని ఆలోచించి రైతు బీమా తెచ్చారని ప్రపంచంలోనే మరెక్కడా రైతు బీమా లేదని కెటిఆర్ అన్నారు. రైతు మరణిస్తే కర్మకాండలోపే ఎల్‌ఐసి ద్వారా 5 లక్షల రూపాయలు వస్తాయన్నారు. అతను తెరాస కార్యకర్త అయితే అదనంగా మరో 2 లక్షలూ వస్తాయన్నారు. తెలంగాణ ఉద్యమం నీళ్ల కోసం సాగిందని, నేడు బీడు భూముల్లోకి పుష్కలంగా గోదావరి నీరు వస్తోందన్నారు. ఎర్రటి ఎండల్లో సిరిసిల్ల మానేరులో జలదృశ్యం ఎవరూ ఊహించలేదన్నారు. ఎగువ మానేరు ప్రాజెక్టులో ఏప్రిల్ మాసంలో మత్తడులు దుంకుతుంటే ప్రజలు వెళ్లి పూజలు చేసి, కేరింతలు కొట్టి ఆనందించారన్నారు.

సిరిసిల్లలో 365 రోజులూ నీరు నిలువ ఉంటోందన్నారు. సిరిసిల్ల ప్రాంతం నీటితో పాపికొండలు, ఆంధ్రా డెల్టా ప్రాంతాన్ని తలపిస్తోందన్నారు.ప్రపంచంలోనే అతిపెద్ద మల్టి ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాళేశ్వరం రూపుదిద్దుకున్నదని,గూగుల్‌లో సెర్చ్ చేస్తే విషయం అర్ధమవుతుందన్నారు.మల్లన్న సాగర్, రాజరాజేశ్వర సాగర్, అన్నపూర్ణ ప్రాజెక్టుల వంటివాటి వల్ల లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. ఇల్లంతకుంట వంటి నీటి ఎద్దడి ప్రాంతాలకు గోదావరి జలాలు చేరడంతో అక్కడ 30 వేల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చిందన్నారు. ఒకప్పుడు గ్రీన్ రెవెల్యూషన్ పంజాబ్‌లో వచ్చిందని అనేవారని ప్రస్తుతం వరిపంటలోతెలంగాణ పంజాబ్‌ను మించిపోయిందన్నారు.దేశానికి తెలంగాణ బువ్వపెడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సాక్షిగా ఆత్మహత్యలను తగ్గించిన రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించిందన్నారు.

కరోన పరిస్ధితుల వల్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా గ్రామాలకు తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండుతోందన్నారు.కేంద్రానికి రైతులపై ప్రేమలేదన్నారు. వనరుల సృష్టికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంటే కేంద్రం మాత్రం అన్నీ అమ్ముతాము కాని వడ్లు కొనమంటున్నారన్నారు. రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పించిందన్నారు.తెలంగాణలో తెరాస అధికారంలో ఉంటే మిగిలిన 28 రాష్ట్రాల్లో బిజేపి, కాంగ్రెస్ అధికారంలో ఉందని అక్కడ తెలంగాణలో రైతులకు అమలవుతున్న పథకాలేవి అమలు కావడం లేదన్నారు.దేశంలో 40 కోట్ల ఎకరాల సాగు యోగ్యమైన సారవంతమైన భూమి ఉందని, నదుల వల్ల 65 కోట్ల టిఎంసిల నీరు లభ్యమవుతోందని దేశ ప్రజల సాగు,త్రాగు నీటి అవసరాల కోసం కేవలం 30 నుండి 35 వేల టిఎంసిల నీరు సరిపోతుందని అయితే సరైన ప్రణాళిక లేక, పాలకుల తీరు సరిగా లేక దేశం వెనుక పడిందన్నారు.

75 సంవత్సరాల పాలన తరువాత కూడా మనం చాలా వెనుకపడి ఉన్నామన్నారు. ఇటీవల ఐరోపా దేశానికి చెందిన సంస్ధ అక్టోబర్‌లో 116 దేశాలపై జరిపిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ సర్వే(ఆకలి ఎక్కువ ఉన్న దేశమేది)లో మనదేశం 102వ స్ధానంలో ఉండగా పాకిస్తాన్ 92వ స్థానం,నేపాల్, బంగ్లాదేశ్‌లు 76వ స్ధానంలో ఉన్నాయన్నారు. ఇన్నేళ్ల పాలనలో మన పాలకులు ఏం సాధించారన్నారు.1960 ప్రాంతంలోనే లాల్ బహదూర్ శాస్త్రీ జైజవాన్ జైకిసాన్ నినాదం ఇస్తే, తెలంగాణలో జైకిసాన్, జైకిసాన్ అంటుంటే నేటి బిజేపి పాలకులు మాత్రం నైకిసాన్, నై కిసాన్ అంటున్నారన్నారు. చేతకాని పాలకుల వల్ల ప్రపంచం ముందు తలదించుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు.దేశంలో అన్ని వనరులున్నా దిక్కుమాలిన రాజకీయాల వల్ల దివాళకోరు విధానాల వల్ల అభివృధ్దికి దూరంగా ఉన్నామన్నారు.

తెలంగాణలో ప్రభుత్వ విధానాల వల్ల రైతులు నిలదొక్కుకుంటున్నారన్నారు. బిజేపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపి బండి సంజయ్ ఇటీవల పాదయాత్రలు చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికల్లోనే బస చేశారని గుర్తు చేశారు. మోడి వడ్లు కొంటామంటే కెసిఆర్ వద్దంటున్నాడా అని ప్రశ్నించారు. అంబేద్కర్ ముందు చూపుతో రాసిన రాజ్యాంగంలో వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉందన్నారు. దేశమంతా ఒకే భౌగోళిక పరిస్థితులు ఉండవు కాబట్టి రాష్ట్రాల్లో పండిన ధాన్యాలను కేంద్రం కొనాలని, దేశమంతా అవసరమున్న చోటకు పంపాలని అన్నారు. ప్రజలకు ఆహర భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదన్నారు. మన రాష్ట్రంలో వర్షాకాలంలో 62 లక్షల ఎకరాల్లో, యాసంగిలో 60 లక్షల ఎకరాల్లో వరి పంట పండిస్తున్నారన్నారు. యాసంగి పంటతోనే సమస్య వస్తోందన్నారు. ఫిబ్రవరి నుండి ఉష్ణోగ్రతలు పెరిగి యాసంగి వడ్లను పట్టిస్తే నూక వస్తుందని అందువల్ల ఉప్పుడు (పారబాయిల్డ్) బియ్యం తయారు చేయక తప్పడం లేదన్నారు. రాష్ట్రాలకు ఎగుమతి అధికారం, అవకాశం లేదని దానికి తోడు తెలంగాణకు సముద్ర తీరం కూడా లేదన్నారు.

కేంద్ర వ్యవసాయ మంత్రి పీయూష్ గోయల్‌ను తనతో పాటుగా సిఎం కెసిఆర్, మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమళాకర్ కలిసి యాసంగి వడ్లు కొనాలని పలుసార్లు విజ్ఞప్తి చేశామని అయినా కేంద్రం స్పందించడం లేదన్నారు. తెలంగాణలో గతంలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువ సామర్ధం ఉంటే దాన్ని 26 లక్షల మెట్రిక్ టన్నుల స్ధాయికి తీసుకు పోయామని, ఒకవేళ మనమే ధాన్యం కొన్నా నిలువ చేసుకునే అవకాశాలు కూడా మనకు లేవన్నారు. అందుకే కేంద్రం చెప్పిన ఆదేశాలు గమనించి రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచించారన్నారు.
గళ్లీలోని సిల్లీ బిజేపి వారు ఓట్ల కోసం డిల్లీ బిజేపి వారు చెప్పింది కాకుండా యాసంగిలో వరివేయాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. గళ్లీ బిజేపి వారు తప్పుడు ప్రచారాలు మానుకొని అభివృధ్ధి పనులు సాధించాలన్నారు.తాము నాలుగు ప్రాజెక్టులు సాధిస్తే బిజేపి వార అందుకు రెండింతలుగా ఎనిమిది ప్రాజెక్టులు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాఫ్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, జిల్లా రైతుబంధు అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా తెరాస ఇంచార్జీ తోట ఆగయ్య, తెరాస రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి, ఎంపిపిలు, జడ్‌పిటిసిలు, రైతు బంధు అధ్యక్షులు, ఏంఎంసి చైర్మన్లు, తెరాస నాయకులు, రైతులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News