Saturday, November 23, 2024

వచ్చే నెల 4న మహాధర్నా

- Advertisement -
- Advertisement -

ఈ నెల 16,17 తేదీల్లో బస్తీల సమస్యలపై ‘బస్తీల బాట‘
18వ తేదీన డబుల్ బెడ్ రూం ఇండ్ల ఇవ్వాలని మండల కేంద్రాల్లో ధర్నాలు
23,24 తేదీల్లో అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం పోరాటం మరింత ఉద్ధృతం చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి వెల్లడించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో శనివారం బిజెపి మహాధర్నా నిర్వహించింది. జిహెచ్‌ఎంసితో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు మార్పును కోరాలని.. బిజెపికి ఒక అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతోందని, వరదలు వచ్చి చనిపోయిన వారి కుటుంబాలను కనీసం పరామర్శించ లేదని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బిఆర్‌ఎస్ పాలనలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పేపర్లపైనే ఉంటాయని, భూమి మీద ఉండవని విమర్శించారు. పేదలకు ఇళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని 2018లో ముఖ్యమంత్రి అన్నారని గుర్తుచేశారు. ‘ప్రగతిభవన్ ను 4 నెలల్లో, సచివాలయాన్ని 8 నెలల్లో కట్టుకున్నారు. పేదలకు ఇచ్చే ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. పేదలకు ఇళ్లు కడితే.. కేంద్రం వాటా తీసుకొచ్చే బాధ్యత నాది అని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ నెల 16, 17 తేదీల్లో ప్రతి ఒక్కరూ బస్తీల సందర్శనకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. 18న అన్ని మండల కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయాలన్నారు. ఈ నెల 23, 24వ తేదీల్లో జిల్లా కలెక్టరేట్ల ముందు. సెప్టెంబరు 4న హైదరాబాద్లో విశ్వరూప ధర్నా ఉంటుందని కిషన్‌రెడ్డి ప్రకటించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తారా.. గద్దె దిగుతారా? అని ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీశ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. దళితబంధు పేరుతో దళితులను, నిరుద్యోగ భృతి పేరుతో విద్యార్థులను దగా చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వస్తాయి. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే పేదలకు ఇక ఎప్పుడూ ఇళ్లు రావు. ఎన్నికల ముందు గృహలక్ష్మి పేరిట మరోసారి మభ్యపెడుతున్నారని ఆరోపించారు. మహాధర్నాకార్యక్రమంలో ఎంపి ధర్మపురి అర్వింద్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపిలు జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, విజయరామారావు, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి. ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, కూన శ్రీశైలంగౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రదీప్‌కుమార్, బంగారు శృతి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News