బీహార్‌లో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తమ మధ్య కుదరిని సీట్ల పంపకం ఒప్పందం కుదరినట్లు మహాగట్బంధన్ శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రంలోని 40 లోక్‌సభ స్థానాలలో లాలూ ప్రసాద్ సారథ్యంలోని ఆర్‌జెడి 26 స్థానాలలో పోటీ చేయనున్నది. కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలలో పోటీ చేస్తుంది. వామపక్షాలకు ఐదు స్థానాలు కేటాయించారు. కటిహార్, కిషన్‌గంజ్, సాట్నా సాహిబ్, ససరం, భగల్‌పూర్, వెస్ట్ చంపారన్, ముజఫర్‌పూర్, సమస్తిపూర్, మహరాజ్‌గంజ్ సీట్లను కాంగ్రెస్‌కు కేటాయించగా బెగుసరాయ్, ఖగారియా, ఆర్, కరాకట్, నలంద సీట్లను వామపక్షాలకు కేటాయించారు. మిగిలిన 26 స్థానాలలో ఆర్‌జెడి తన అభ్యర్థులను బరిలోకి దించుతుంది.
బీహార్‌లోని 40 లోక్‌సభ స్థానాలకు ఏడు దశలలో పోలింగ్ జరగనున్నది. జూన్ 4న కౌంటింగ్ జరగనున్నది. 2019 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకోగా ఆర్‌జెడి, వామపక్షాలు బోణీ కొట్టలేకపోయాయి. బిజెపి, జెడియులతో కూడిన ఎన్‌డిఎ కూటమి 2019 ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేశాయి. బిజెపికి 17, జెడియు 16 సీట్లు లభించాయి. బిజెపికి 24 శాతం ఓట్ల శాతం దక్కగా జెడియుకు 22.3 శాతం ఓట్లు లభించాయి. అవిభక్త ఎల్‌జెపి ఆరు స్థానాలను గెలుచుకుని 8 శాతం ఓట్లను సాధించింది. కాంగ్రెస్‌కు కేవలం 7.9 శాతం ఓట్లు మాత్రమే లభించాయి.